60 మంది అమ్మాయిల వీడియోలు లీక్‌..? క్లారిటీ ఇచ్చిన చండీగఢ్ యూనివర్సిటీ

18 Sep, 2022 15:16 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం చెలరేగి యూనివర్సిటీ విద్యార్థినిలు నిరసనకు కూడా దిగారు. అయితే విషయంపై యాజమాన్యం స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం, అర్థరహితం అని కొట్టిపారేసింది.

యూనివర్సిటీలో ఒక్క అమ్మాయి ప్రైవేటు వీడియో మాత్రమే లీక్ అయినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఓ అమ్మాయి తన సొంత వీడియోను సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని వెల్లడించింది. తాము చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ ఒక్క వీడియో తప్ప మరే ఇతర అమ్మాయిల వీడియోలు లీక్‌ కాలేదని తేలిందని చెప్పింది. 60 ప్రైవేటు వీడియోలు లీక్‌ అయ్యాయని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్‌ డా.బవా స్పష్టం చేశారు. ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు.

అలాగే చండీగఢ్ యూనివర్సిటీలో ఏడుగురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని బవా చెప్పారు. ఏ ఒక్క విద్యార్థిని కనీసం ఆస్పత్రిలో కూడా చేరలేదని వెల్లడించారు.  వీడియో లీక్ చేసిన అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారని, కేసు విచారణలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.

చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్‌ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..!

మరిన్ని వార్తలు