ఐదో తరగతి చదివిన ఎమ్మెల్యే కరోనా రోగులకు వైద్యం

24 May, 2021 13:29 IST|Sakshi

అహ్మదాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ బారినపడిన వారికి వైద్య సేవలు అంతంత మాత్రాన అందుతున్నాయి. వారి సేవలకు అడ్డంకిగా ప్రజాప్రతినిధులు మారారు. తరచూ పర్యటనలు చేస్తుండడంతో కొంత వైరస్‌ బాధితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే చేసిన పని తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆ విమర్శలను ఆ ఎమ్మెల్యే సమర్ధించుకుని వివరణ ఇచ్చుకున్నారు. ఆయన చదివింది ఐదో తరగతి కావడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. 

గుజరాత్‌లోని కమ్రేజ్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వీడీ జలవడియా. ఆయన చదివింది ఐదో తరగతి వరకే. అయితే ఆదివారం సర్తన ప్రాంతంలోని కరోనా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. అక్కడ ఆయన వైద్యుడి రూపమెత్తారు. ఈ క్రమంలో రెమిడిసివర్‌ వ్యాక్సిన్‌ తీసుకుని సిరంజీలో ఎక్కించేందుకు కష్టపడ్డాడు. అనంతరం ఆ సిరంజీని చికిత్స పొందుతున్న కరోనా బాధితుడి గ్లూకోజ్‌ బాటిల్‌లో గుచ్చారు. ఇది చేసేందుకు కొంత ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా ఆయన కరోనా బాధితుల సహాయార్థం కష్టపడుతున్నారని ఆయన అనుచరులు, బీజేపీ నాయకులు ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 

ఈ వీడియో వైరల్‌గా మారింది. ఐదో తరగతి చదివిన ఎమ్మెల్యే వైద్యుడి అవతారమెత్తారంటారంటూ కామెంట్లు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ‘వైద్య శాఖ మంత్రి ఆ ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకోవాలి. బీజేపీ కార్యకర్తలకు అందరికీ కరోనా వైద్యం నేర్పించండి. జలవడియా ఆధ్వర్యంలో ఆ ఆ చికిత్స విధానంపై శిక్షణ ఇవ్వండి’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాజ్‌సిన్హ్‌ పర్మర్‌ తెలిపారు. 

మంచి పనులను కూడా విమర్శించడం కాంగ్రెస్‌కు అలవాటు అని ఆ ఎమ్మెల్యే కొట్టిపారేశారు. ‘40 రోజులుగా 10-15 వైద్యులతో ఉంటున్నా. 200 మంది కరోనా బాధితులను రక్షించా. కరోనా బాధితులకు బీజేపీ నాయకులు కూడా సహాయం చేస్తున్నారు’ అని ఎమ్మెల్యే జలవడియా వివరణ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు