బలగాల ఉపసంహరణపై చైనాతో డీల్‌

12 Feb, 2021 03:50 IST|Sakshi

పాంగాంగ్‌ సరస్సు ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల అంగీకారం

ఫింగర్‌ 8 వరకు వెనక్కు వెళ్లనున్న చైనా

రాజ్యసభలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల తొలగింపు లక్ష్యంగా ఇరుదేశాల మధ్య కీలకమైన ఒప్పందం కుదిరిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం పార్లమెంటులో వెల్లడించారు. ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైన పాంగాంగ్‌ సో సరస్సుకు ఇరువైపుల మోహరించిన బలగాలను రెండు దేశాలు వెనక్కు తీసుకునే విషయంలో ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందం మేరకు సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వద్ద మోహరించిన ఫ్రంట్‌లైన్‌ సైనికులు ‘దశలవారీగా, సమన్వయంతో, నిర్ధారించుకోదగిన విధానంలో’వెనక్కు వెళ్తారని పేర్కొన్నారు.

దాదాపు గత 9 నెలలుగా రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా చైనాతో కుదిరిన ఒప్పందం వివరాలను రాజ్‌నాథ్‌ సింగ్‌ రాజ్యసభకు వెల్లడించారు. తాజా ఒప్పందంతో గత సంవత్సరం మే 5 నాటి కన్నా ముందున్న స్థితికి సరిహద్దుల్లో పరిస్థితులు చేరుకుంటాయన్నారు. అన్ని ద్వైపాక్షిక నిబంధనలు, ఒప్పందాలను గౌరవిస్తూ, సాధ్యమైనంత తొందరగా ఉపసంహరణ జరగాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయన్నారు. పాంగాంగ్‌ సొ సరస్సునకు ఇరువైపులా గత సంవత్సరం ఏప్రిల్‌ తరువాత నిర్మించిన అన్ని నిర్మాణాలను తొలగించేందుకు అంగీకారం కుదిరిందన్నారు.

ఏ విషయాన్ని దాచి పెట్టలేదు
ఆయా ప్రాంతాల్లో గస్తీ సహా అన్ని మిలటరీ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు వెల్లడించారు. గస్తీ పునః ప్రారంభంపై ఇరుదేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయన్నారు. చైనాతో చర్చల విషయంలో భారత్‌ ఏ విషయాన్ని దాచి పెట్టలేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. అలాగే, భారత భూభాగంలోని అంగుళం భూమిని కూడా ఎవరూ తీసుకోవడానికి అంగీకరించబోమన్నారు. తాజా ఒప్పందం ప్రకారం, చైనా తమ సైనిక బలగాలను పాంగాంగ్‌ సరస్సు ఉత్తర సరిహద్దు నుంచి తూర్పు దిశగా ‘ఫింగర్‌ 8’ వరకు వెనక్కు తీసుకుంటుందని రాజ్‌నాథ్‌ తెలిపారు.

అలాగే, భారత దళాలు ‘ఫింగర్‌ 3’ సమీపంలోని శాశ్వత మిలటరీ కేంద్రం ధన్‌సింగ్‌ థాపా పోస్ట్‌ వరకే పరిమితమవుతాయన్నారు. ఈ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి రావడం ప్రారంభమైందన్నారు. ఈ ఉపసంహరణ ముగిసిన 48 గంటల్లోపు రెండు దేశాల మిలటరీ కమాండర్‌ స్థాయిలో మరో విడత చర్చలు జరుగుతాయన్నారు. అప్పుడు, ఇతర అపరిష్కృత అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. ‘ప్రణాళికాబద్ధ విధానంతో చైనాతో క్రమం తప్పకుండా చర్చలు కొనసాగించిన కారణంగా, పాంగాంగ్‌ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వెంట మోహరించి ఉన్న ఇరుదేశాల బలగాల ఉపసంహరణకు ఒప్పందం కుదిరింది’అని రాజ్‌నాథ్‌ రాజ్యసభలో ప్రకటించారు.

పాంగాంగ్‌ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వెంట చైనా, భారత్‌ దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చైనా బుధవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు. సైనికులు చేసిన త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందన్నారు. పాంగాంగ్‌ సరస్సుకు ఉత్తరంగా ఫింగర్‌ 4 నుంచి ఫింగర్‌ 8 వరకు చైనా తన బలగాలను ఉపసంహరించాలని ఆ దేశంతో జరిగిన 9 విడతల చర్చల్లోనూ భారత్‌ గట్టిగా వాదించింది. ప్రతిగా, సరస్సు దక్షిణ తీరం వెంట ఉన్న కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల నుంచి భారత దళాలు వైదొలగాలని చైనా డిమాండ్‌ చేసింది. ముఖపరి, రెచిన్‌ లా, మగర్‌ హిల్‌ తదితర వ్యూహాత్మకంగా కీలకమైన పర్వత ప్రాంతాలను ఐదు నెలల క్రితం భారత దళాలు స్వాధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం.. ఫింగర్‌ 3 నుంచి ఫింగర్‌ 8 వరకు తాత్కాలికంగా ‘నో పెట్రోలింగ్‌ జోన్‌’గా మారుతుంది. ఫింగర్‌ 4 నుంచి ఫింగర్‌ 8 మధ్య చైనా పలు బంకర్లను నిర్మించింది. ఫింగర్‌ 4 ను దాటి ముందుకు వచ్చేందుకు ప్రయత్నించిన భారత దళాలను అడ్డుకుంది. చైనా దళాలు ఫింగర్‌ 8 వరకు వెళ్లేందుకు అంగీకరించడం గొప్ప విజయంగా భావించవచ్చని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు.
రాజ్యసభలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్‌

మరిన్ని వార్తలు