మిషన్‌ చోక్సీ బృందం తిరుగుముఖం

5 Jun, 2021 06:09 IST|Sakshi

డొమినికా నుంచి బయల్దేరిన భారత అధికారులు

ఇప్పట్లో చోక్సీ అప్పగింత లేనట్టే

కోర్టుల్లో రెండు కేసులపై కొనసాగుతున్న విచారణ  

న్యూఢిల్లీ: రూ.13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీని ఇప్పట్లో భారత్‌కు అప్పగించే అవకాశాలు కనిపించడం లేదు. డొమినికా దేశ ప్రభుత్వం చోక్సీని అప్పగిస్తే వెంట తీసుకువద్దామని ఆ దేశానికి వెళ్లిన ‘మిషన్‌ చోక్సీ’భారత అధికారుల బృందం స్వదేశానికి తిరిగి బయల్దేరింది. సీబీఐ అధికారిణి శారద రౌత్‌ నేతృత్వంలోని బృందం డొమినికాలో ఏడు రోజుల పాటు మకాం వేసింది. చోక్సీ తరఫు లాయర్లు దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ విచారణ వచ్చే నెలకి వాయిదా పడడంతో 8 మంది సభ్యులతో కూడిన భారత్‌ బృందం తిరుగుముఖం పట్టింది. జూన్‌ 3 రాత్రి 8 గంటల ప్రాంతంలో డొమినికా విమానాశ్రయం నుంచి ప్రత్యేక ప్రైవేట్‌ జెట్‌ విమానంలో భారతీయ అధికారులు స్వదేశానికి బయల్దేరినట్టుగా ఆ దేశంలోని స్థానిక మీడియా వెల్లడించింది. డొమినికాలో చోక్సీపై రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి.

ఆంటిగ్వా నుంచి డొమినికా దేశానికి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణలతో అరెస్టయిన కేసులో న్యాయస్థానం చోక్సీకి బెయిల్‌ మంజూరు చేయలేదు. ఈ కేసు విచారణ ఈ నెల 14న జరగనుంది. మరోవైపు చోక్సీ లాయర్లు ఆయన కనిపించడం లేదంటూ హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయగా దానిపై విచారణను జూలైకి వాయిదా పడింది. ఈ పరిణామాలతో చోక్సీని డొమినికా ప్రభుత్వం వెనువెంటనే భారత్‌కు అప్పగించే అవకాశాలు లేకపోవడంతో భారత్‌ బృందం వెనక్కి బయల్దేరింది. మరోవైపు కోర్టులో విచారణ సాగుతుండగా కొందరు నిరసనకారులు డొమినికాకు చోక్సీని ఎవరు తీసుకువచ్చారు? అని రాసి ఉన్న ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. 62 ఏళ్ల వయసున్న చోక్సీ తన ప్రియురాలితో కలిసి డొమినికాకు వచ్చి పట్టుబడ్డాడని కొందరు చెబుతూ ఉంటే, ఆయనని కిడ్నాప్‌ చేసి తీసుకువచ్చారని చోక్సీ తరఫు లాయర్లు వాదిస్తున్నారు. 2018లో భారత ప్రభుత్వం కళ్లుగప్పి అంటిగ్వాకు పరారైన చోక్సీ మే 23న అంటిగ్వాలో కనిపించకుండా పోయారు. డొమినికాలో పోలీసులకు పట్టుబడ్డారు. 

మరిన్ని వార్తలు