5జీ నెట్‌వర్క్‌తో పర్యావరణానికి పెనుముప్పు 

1 Jun, 2021 03:28 IST|Sakshi

 ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్‌ నటి జుహీ చావ్లా పిటిషన్‌ 

న్యూఢిల్లీ: దేశంలో అత్యాధునిక 5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంపై బాలీవుట్‌ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 5జీ నెట్‌వర్క్‌తో విపరీతమైన రేడియేషన్‌ వెలువడుతుందని, తద్వారా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుందని చెప్పారు. ఇది మనుషుల మనుగడపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విలువైన జంతుజాలం, పక్షులు అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు.

5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ను వ్యతిరేకిస్తూ జుహీ చావ్లా సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ జస్టిస్‌ సి.హరిశంకర్‌ ముందుకు విచారణకు రాగా, ఆయన దాన్ని మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జుహీ చావ్లా పిటిషన్‌పై జూన్‌ 2న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగనుంది. 5జీ నెట్‌వర్క్‌తో రేడియేషన్‌ ఇప్పుడున్న దానికంటే 10 నుంచి 100 రెట్లు పెరిగిపోతుందని జుహీ చావ్లా పేర్కొన్నారు. భూమిపై ఉన్న ఏ ఒక్క మనిషి, జంతువు, పక్షి, కీటకం, చెట్టు ఈ రేడియేషన్‌ నుంచి తప్పించుకోలేవని తెలియజేశారు. అంతేకాకుండా మన పర్యావరణానికి శాశ్వతమైన నష్టం వాటిల్లుతుందన్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు