కొత్త జంటపై నెటిజన్ల ప్రశంసల వర్షం

10 Dec, 2020 16:04 IST|Sakshi

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఓ మధుర జ్ఞాపకం. రెండు మనసులను ఒక్కటి చేసే వేడుక. ఇరు కుటుంబాల కలయిక. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగితేనే ఆ బంధానికి విలువ ఉంటుంది. కర్ణాటకకు చెందిన నవ దంపతులు అనుదీప్‌ హెగ్డే, మినుషా కాంచన్‌ ఆ కోవకు చెందినవారే. పెళ్లి తర్వాత కచ్చితంగా హనీమూన్‌ వెళ్లాల్సిందేనని ఆమె పట్టుబట్టలేదు. భార్య కోరలేదు కదా అని అతడు అడగకుండా ఉండనూ లేదు. వీలు కుదుర్చుకుని ఇద్దరికీ నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఏకాంతంగా సమయం గడపాలనుకున్నారు. 

అయితే అంతకంటే ముందు తమకు అత్యంత సమీపంలో ఉన్న సోమేశ్వర్‌ బీచ్‌ను సందర్శించారు. అక్కడికి వెళ్లిన తర్వాత హనీమూన్‌కు వెళ్లాలన్న ఆలోచనను పక్కకు పెట్టేశారు. సరదాగా గడపడం కంటే ప్రకృతిని కాపాడుకోవడమే వారికి ప్రథమ ప్రాధాన్యంగా తోచింది. వెంటనే రంగంలోకి దిగారు. తమతో పాటు నలుగురి మద్దతు కూడగట్టుకుని బీచ్‌ ప్రాంగణంలో పోగైన చెత్తను ఏరిపారేసే బృహత్కార్యం తలకెత్తుకున్నారు. 10 రోజుల పాటు శ్రమించి సుమారు 800 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలు, పనికిరాని వస్తువులను అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను అనుదీప్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ‘మీరిలాగే కలకాలం వర్ధిల్లాలి’ అంటూ నెటిజన్లు కొత్తజంటపై అభినందనల అక్షింతలు జల్లుతున్నారు.(చదవండి: తల్లిదండ్రులైన ఆకాశ్‌ దంపతులు )

పోస్ట్‌ వెడ్డింగ్‌ చాలెంజ్‌
‘‘ మా ఇద్దరి కల ఇది. పోస్ట్‌ వెడ్డింగ్‌ చాలెంజ్‌, పది రోజుల అవిశ్రాంత శ్రమ తర్వాత బైందూరులోని సోమేశ్వర్‌ బీచ్‌లోని చెత్తాచెదారాన్ని తొలగించాం. ఇప్పుడు ఇదొక మహోద్యమంగా మారింది. అంతా కలిసి 8 క్వింటాళ్లకు పైగానే చెత్తను ఏరివేశాం. మాకొక మంచి అనుభవం ఇది. మానవత్వం ఇంకా బతికే ఉందనే నా నమ్మకాన్ని నిజం చేసింది. మేమంతా మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే. ఇలాంటి కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించండి. కలిసి పనిచేస్తే ఇంకెంతో మార్పును తీసుకురాగలం’’ అని అనుదీప్‌ విజ్ఞప్తి చేశాడు.

అదే విధంగా... ‘‘నేను, నాలో సగభాగమైన నా భార్య మినుషా ఈ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. ఎంతో మంది మాతో చేతులు కలిపి బీచ్‌ను శుభ్రం చేసేందుకు వచ్చిన తీరు అత్యద్భుతం. మా లక్ష్యాన్ని చేరుకునే దిశగా సాయం అందించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తమకు సహకరించిన వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఈ అనుదీప్‌- మినుషా స్టోరీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.(చదవండి: ఆన్‌లైన్‌లో పెళ్లికి 2 వేల మంది అతిధులు)

A post shared by Anudeep Hegde (@travel_nirvana)

మరిన్ని వార్తలు