కరోనా టీకా డోస్‌ @ 90 కోట్లు

3 Oct, 2021 04:23 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కరోనా మరణాలు

అమెరికాలో అత్యధికంగా 7.02 లక్షల మరణాలు

భారత్‌లో 4.48 లక్షల మంది మృతి

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఇచ్చిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 90 కోట్ల మైలురాయిని దాటింది. కరోనా మహమ్మారి ఎదుర్కొనేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సిన్‌ వేసిన ప్రభుత్వం, మార్చి 1వ తేదీ నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించిన తర్వాత డ్రైవ్‌ వేగం పుంజుకుంది. గత 259 రోజుల్లో 90 కోట్లకు పైగా డోస్‌లను అందించారు. వీటిలో సెపె్టంబర్‌ 17న ప్రధాని మోదీ పుట్టినరోజున అత్యధికంగా 2.50 కోట్ల డోసులను ప్రజలకు అందించారు. కాగా దేశంలో మొట్టమొదటిసారిగా ఆగస్టు 27న రోజువారీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌ల సంఖ్య 1 కోటి దాటింది.   దేశంలోని 47.3%మందికి తొలిడోస్, 17.4% మందికి రెండు డోస్‌లను వేశారు.

అమెరికాలో అత్యధికంగా 7 లక్షల మరణాలు:
అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ 187 దేశాలలో గుర్తించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా, కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 50 లక్షల మార్క్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 49.97 లక్షల మంది కరోనాతో మరణించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

197 రోజుల కనిష్టానికి యాక్టివ్‌ కేసులు
దేశంలో 24 గంటల్లో నమోదైన 24,354 కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,37,91,061కు చేరుకుందని కేంద్రం తెలిపింది. అదేవిధంగా, 197 రోజుల తర్వాత యాక్టివ్‌ కేసులు 2,73,889కు తగ్గినట్లు శనివారం వెల్లడించింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా బాధితుల్లో మరో 234 మంది చనిపోవడంతో కోవిడ్‌ మరణాలు 4,48,573కు చేరినట్లు తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.81%గా ఉన్నాయి. 2020 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. అదే సమయంలో, రికవరీ రేట్‌ అత్యధికంగా 97.86%గా ఉంది.

అయిదు నిమిషాలకో మరణం
ఏడు రోజుల్లో ప్రపంచంలో 8 వేల మంది కరోనా ఇన్ఫెక్షన్‌ కారణంగా మరణించారు. అంటే, ప్రతి 5 నిమిషాలకు ఒకరు కరోనాతో మరణిస్తున్నారు. గత ఏడు రోజుల్లో ప్రపంచ సగటు మరణాలలో సగానికి పైగా అమెరికా, రష్యా, బ్రెజిల్, మెక్సికో, భారత్‌ల్లో నమోదయ్యాయి. అయితే గత కొన్ని వారాలుగా ప్రపంచంలో కరోనా మరణాల రేటు తగ్గింది. ప్రపంచంలో కరోనా సంక్రమణ కారణంగా అత్యధిక మరణాలు అమెరికాలోనే సంభవించాయి. అక్కడ 7.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా అమెరికాలో ఇప్పటివరకు సుమారు 56.1% మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తిచేశారు. అదే సమయంలో శుక్రవారం, రష్యాలో కరోనా కారణంగా 887 మరణాలు నమోదయ్యాయి. ఇది కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచిఒక రోజులో అత్యధికం.  భారత్‌లో కరోనా రెండో వేవ్‌ సమయంలో, డెల్టా వేరియంట్‌ కారణంగా రోజుకు సగటున 4వేల మరణాలు సంభవించాయి, అయితే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ వేగం అందుకున్న తర్వాత ఈ సగటు కేవలం 300 కి తగ్గింది.

మరిన్ని వార్తలు