కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..!

20 Apr, 2021 17:59 IST|Sakshi

రాయ్‌పూర్‌: ఒక వైపు కరోనా.. మరోవైపు మండే ఎండలు... మామూలు మనుషులకే బయట తిరగాలంటే భయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భవతి అయి ఉండి కూడా.. తన విధులను బాధ్యతగా నిర్వహిస్తూ.. జనాల ప్రశంసలు పొందుతున్నారు ఓ డీఎస్పీ. ప్రెగ్నెంట్‌ అయి ఉండి కూడా మండే ఎండల్లో కరోనాను లెక్కచేయకుండా పని చేస్తున్న ఈ ఉద్యోగిని వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఆ వివరాలు.. ఛత్తీస్‌గడ్‌లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్‌​ డివిజన్‌ దంతేవాడలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు శిల్పసాహు. ప్రస్తుతం ఆమె గర్భవతి. మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది కనుక ఆమె ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ అలా చేయడం ఆమెను ఇష్టం లేదు. అందుకే తోటి ఉద్యోగుల మాదిరి ఆమె విధులకు హాజరయ్యారు. మండుటెండలో చౌరస్తాలో నిలబడి.. చేతిలో లాఠి పట్టుకుని ట్రాఫిక్‌ విధులు నిర్వహించారు. బయటకు వచ్చిన జనాలను త్వరగా పని ముగించికుని.. ఇంటికి తిరిగి వెళ్లమని కోరుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని విన్నవిస్తున్నారు.  కరోనా గైడ్‌లైన్స్‌ను కచ్చితంగా పాటించాలని ప్రజలందరికీ విజ్ఙప్తి చేస్తోంది.

కాగా,  ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా కరోనా కట్టడిలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీకి సోషల్‌ మీడియాలో సెల్యూట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులను నిర్వహిస్తున్నారనడానికి ఈ సంఘటన ఒకటి చాలు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కాగా భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం రోజున భారత్‌లో కొత్తగా 2,59,170 కరోనా కేసులు నమోదవ్వగా, 1,761 మంది కరోనా మృతి చెందారు

చదవండి: మగువా నీకు సలామ్‌.. 8నెలల గర్భంతో గోల్డ్ మెడల్

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు