రెండ్రోజుల్లో 39మంది విదేశీ ప్రయాణికులకు కరోనా.. ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్‌!

28 Dec, 2022 16:25 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచింది భారత్‌. రాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపిస్తోంది. అయితే, గడిచిన రెండు రోజుల్లోనే భారత్‌కు వచ్చిన 39 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌ ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోని విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు 6000 మందికి రాండమ్‌గా పరీక్షలు నిర్వహించినట్లు విమానయాన శాఖ అధికారవర్గాలు తెలిపాయి. 

విదేశీ ప్రయాణికుల్లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెంచారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌ మాండవియీ గురువారం అక్కడికి వెళ్లనున్నట్లు సమాచారం.

వచ్చే 40 రోజులు కీలకం..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో వచ్చే 40 రోజులు కీలకంగా మారనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. వచ్చే 40 రోజుల్లో భారత్‌లో కోవిడ్‌ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, గతంలోని డేటా ప్రకారం జనవరిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రజలు కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

ఇదీ చదవండి: తమిళనాడు ఎయిర్‌పోర్టుల్లో నలుగురికి పాజిటివ్‌.. చైనా వేరియంట్‌?

మరిన్ని వార్తలు