ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 110 ఏళ్ల తర్వాత కన్పించిన పులి.. ఫొటో వైరల్..

28 Apr, 2023 17:01 IST|Sakshi

చండీగడ్‌: హరియాణా యుమునానగర్ జిల్లాలోని కలెసర్‌ నేషనల్ పార్కులో 110 ఏళ్ల తర్వాత పులి కన్పించింది. పార్కులో ఏర్పాటు చేసిన కెమెరాలో పులి దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో హరియాణా అటవీ శాఖ మంత్రి, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. చివరిసారిగా ఈ పార్కులో 1913లో పులి కన్పించదని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కన్పించడం ఆనందంగా ఉందన్నారు.

అలాగే ఈ పులి కాలి గుర్తులను పరిశీలించి దాని వయసు, లింగం వంటి ఇతర విషయాలు తెలుసుకోవాలని అటవీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఈ పులి ఏప్రిల్ 18, 19 తేదీల్లో ఈ పార్కులో కన్పించింది.

అయితే వన్యమృగం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లోని రాజాజీ నేషనల్ పార్కు నుంచి కలెసర్ పార్కులోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హిమాచల్ సింబల్‌బరా నేషల్‌ పార్కు కూడా కలెసర్  పార్కు పక్కనే ఉంది. దీంతో ఈ మూడు పార్కుల్లో పులి సంచరిస్తోందని, కానీ కలెసర్  పార్కులోనే నివాసముంటుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల పాటు దీని కదలికలు పరిశీలిస్తే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

కాగా.. కలెసర్  నేషనల్ పార్కు ఎన్నో వన్యమృగాలకు నిలయంగా ఉంటోంది. 11,570 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో చిరుత పులులు, ఏనుగులు, ఇతర రకాల అడవీ జంతువులు నివసిస్తున్నాయి. అయితే పులి కన్పించండం మాత్రం 110 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
చదవండి: ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు

మరిన్ని వార్తలు