కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం.. రాజ్యసభకు ఐదుగురు నామినేట్‌.. ప్రత్యేకత ఏమిటంటే..?

21 Mar, 2022 19:32 IST|Sakshi

ఛండీగఢ్‌: జాతీయ పార్టీలకు షాకిస్తూ పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది పంజాజ్‌ భగవంత్‌ మాన్ సర్కార్‌. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, మంత్రులకు టార్గెట్‌ ఇచ్చిన ఆప్‌ ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. ఐదుగురు విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులను రాజసభ్యకు నామినేట్‌ చేస్తూ దేశ రాజకీయాలను ఆకర్షించింది.

సోమవారం పంజాబ్ రాష్ట్రం నుంచి ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆప్‌ అభ్యర్థులుగా ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, క్రికెటర్ హర్భజన్ సింగ్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు) వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అశోక్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసింది. నామినేషన్ దాఖలుకు సోమవారం చివరి రోజు కాగా మార్చి 31న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న రాఘవ్ చద్దా.. అతిచిన్న వయసులో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అంతేకాకుండా చద్దా.. పంజాబ్ ఆప్ పార్టీ ఇంచార్జ్‌గా, ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్‌, స్పిన్‌ దిగ్గజం హర్భజన్ సింగ్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్ చాలా కాలంగా ఆప్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు పాఠక్‌ అత్యంత సన్నిహితుడు. ఎన్నికల వ్యూహాల రచించడంతో కీలక పాత్ర పోషించారు.

ఇక, విద్యా రంగంలో చేస్తున్న సేవలను గుర్తించిన ఆప్‌.. పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్‌ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్‌ అరోరాకు కూడా ఆప్‌ అవకాశం ఇచ్చింది.

మరిన్ని వార్తలు