19 మంది బీజేపీ ముఖ్య నేతలతో అమిత్‌ షా భేటీ.. పొలిటికల్‌ గేమ్‌లో మరో ప్లాన్‌!

17 Sep, 2022 11:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సెప్టెంబర్‌ 17న బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరైన విషయం తెలిసిందే. కాగా, పరేడ్‌ గ్రౌండ్స్‌ సభలో అమిత్‌ షా.. కేసీఆర్‌ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అనంతరం, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. హరిత ప్లాజాలో బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి గురించి, మునుగోడు ఉప​ ఎన్నికలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ గెలవని 19 ఎంపీ స్థానాల గురించి చర్చించనున్నారు. భువనగిరి, నల్లగొండ, మహబూబాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ స్థానాల్లో బీజేపీ ఇప్పటి వరకు విజయం సాధించలేదు.

కాగా, ఈ స్థానాల్లో గెలుపు కోసం ఈ సమావేశంలో ముఖ్య నేతలకు అమిత్‌ షా దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా అమిత్‌ షా.. కేవలం 19 మంది ముఖ్య నేతలతో మాత్రమే భేటీ అయ్యారు. ఇతర నేతలు ఎవరికీ.. ఈ భేటీలోకి అనుమతివ్వలేదు. ఇక, హైదరాబాద్‌ ఎంపీ స్థానం గురించి కూడా ప్రత్యేకంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ముఖ్య నేతలతో చర్చించనున్నట్టు సమాచారం. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ నియోజకవర్గంలో బూత్‌ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది.  

ఇది కూడా చదవండి: వారి త్యాగాల వల్లే నువ్వు అధికారంలో ఉన్నావ్‌ కేసీఆర్‌: అమిత్‌ షా ఫైర్‌

మరిన్ని వార్తలు