మోదీజీ.. ఆయనంటే మీకు ఎందుకంత భయం?

7 Oct, 2022 15:34 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: చైనా జిన్‌జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ఘర్లపై జరుగుతున్న మనవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు ముసాయిదా తీర్మానం వచ్చింది. అయితే దీనిపై చర్చకు జరిగిన ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. పలు ఇతర దేశాలు కూడా ఓటింగ్‍లో పాల్గొనకపోవడంతో ఇది చైనాకు అనుకూలంగా మారింది. తీర్మానం వీగిపోయింది. ఫలితంగా చైనాకు మరోసారి తిరుగులేకుండా పోయింది.

ఈ విషయంపై స్పందిస్తూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. ఆయనతో 18 సార్లు భేటీ అయినా.. ఏది కరెక్ట్‌, ఏది తప్పో చెప్పే ధైర్యం లేదా అని ‍నిలదీశారు. ఐరాస ఓటింగ్‌లో భారత్‌ దూరంగా ఉండి చైనాకు ఎందుకు అనుకూలంగా వ్యవహరించిందో ప్రధాని చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామ మహమద్ కూడా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. మన భూమిని చైనా ఆక్రమించిందని చెప్పడానికి గానీ, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలకు ఖండించడానికి గానీ మోదీ సిద్ధంగా లేరు, చైనా అంటే ఆయనకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు.

ఐరాస మానవహక్కుల కమిషన్‌ తీర్మానంపై జరిగిన ఓటింగ్ ఫలితం చైనాకు అనుకూలంగా వచ్చింది. 19 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్‌, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో తీర్మానం వీగిపోయింది.
చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు

మరిన్ని వార్తలు