ఎవరికీ, ఎప్పటికీ భయపడను.. నా బలం మీరే: చిరాగ్‌ పాశ్వాన్‌

5 Jul, 2021 12:51 IST|Sakshi

న్యూఢిల్లీ/పట్నా: ‘‘ఈరోజు నా తల్లి, నేను ఒంటరిగా పోరాడుతున్నాం. నా బలం బిహార్‌ ప్రజలే. మీ మద్దతు కారణంగానే ఇదంతా సాధ్యమమవుతోంది. నేను సింహం బిడ్డను. నన్ను ఎంతగా దెబ్బకొట్టాలని చూసినా... ఎవరికీ, ఎప్పటికీ భయపడను. మీరే నా ధైర్యం’’ అంటూ లోక్‌ జనశక్తి పార్టీ ఎంపీ, దివంగత కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాశ్వాన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులు అనుకున్న వారు నట్టేట ముంచినప్పటికీ, ప్రజల అండతో తిరిగి పుంజుకుంటానని పేర్కొన్నారు. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ జయంతి సందర్భంగా చిరాగ్‌ పాశ్వాన్‌ సోమవారం.. ‘‘పాశ్వాన్‌’’ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఈరోజు మా బాబాయ్‌ నాకు అండగా నిలబడతారని ఆశించా. కానీ అది జరుగలేదు. మరేం ఫర్వాలేదు. అంకితభావం, కఠిన శ్రమతోనే గుర్తింపు దక్కుతుందని నాన్న చెప్పేవారు. ఆయన మాటలే నాకు స్ఫూర్తి. నేను నాన్నగారి బాటనే ఎంచుకున్నాను’’ అని ఉద్వేగపూరితంగా మాట్లాడారు. అదే విధంగా బాబాయ్‌ పశుపతి పరాస్‌తో విభేదాల గురించి ప్రస్తావిస్తూ... ‘‘కొంత మంది కుటుంబ సభ్యులే మమ్మల్ని మోసం చేశారు.

కానీ.. ఎంతో శక్తివంతమైన మా ప్రజాకుటుంబం మాతోనే ఉంది. సొంతం అనుకున్న వాళ్లు మోసం చేయవచ్చేమో కానీ.. ఈ విస్త్రృత కుటుంబం మాత్రం నాతోనే ఉంటుందని బలంగా నమ్ముతున్నా’’ చిరాగ్‌ పాశ్వాన్‌ పేర్కొన్నారు. ఇక హాజీపూర్‌ నుంచి ఆశీర్వాద్‌ యాత్ర ప్రారంభిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాగా హాజీపూర్‌ ఎంపీ పశుపతి పరాస్‌ ఎల్జేపీలో తిరుగుబాటు లేననెత్తి ఎల్జేపీ జాతీయాధ్యక్ష పదవి దక్కించుకోవడంతో పాటు పార్లమెంటరీ నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గం నుంచే చిరాగ్‌ యాత్ర మొదలుపెట్టడం గమనార్హం. 


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు