శివసేన ఎమ్మెల్యేలకు కష్టంగా ఉండేది.. ఎన్సీపీ, కాంగ్రెస్‌ మాత్రం అవకాశం కోసం చూశాయి: సీఎం షిండే

6 Jul, 2022 10:39 IST|Sakshi

సాక్షి, ముంబై: బీజేపీ తనకు ఎందుకు మద్దతుగా నిలిచిందో చెప్పారు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే. ఆ పార్టీకి అధికారం మాత్రమే కాదు సిద్ధాంతం కూడా ముఖ్యమనేందుకు తమ ప్రభుత్వమే నిదర్శనమన్నారు.  ఎమ్మెల్యేలు హిందుత్వానికే కట్టుబడి ఉండి తిరుగుబాటు చేయడం వల్లే ఉద్ధవ్‌ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో శివసేన ఎమ్మెల్యేలకు పనులు పూర్తి చేయడానికి కష్టంగా ఉండేదని షిండే పేర్కొన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ మాత్రం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో బలపడాలని చూశాయని ఆరోపించారు.

బీజేపీపై ఆ అపోహ నిజం కాదు
అధికారం కోసం బీజేపీ ఎమైనా చేస్తుందనే అపోహ ప్రజల్లో ఉందని, కాని అది నిజం కాదని షిండే అన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు హిందుత్వానికి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకే ఆ పార్టీ తమకు మద్దతుగా నిలిచిందని చెప్పారు. హిందుత్వం, అభివృద్ధే తమ ఉమ్మడి ఎజెండా అని, అందుకే బీజేపీకి తమకంటే చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. సీఎం పదవి తనకిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిందని షిండే తెలిపారు. మహారాష్ట్రను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ప్రధాని మోదీ తనకు సూచించారని షిండే ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహకారం ఉంటుందని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారని చెప్పారు.

200 స్థానాల్లో గెలుస్తారా?
తాము చట్టవిరుద్ధంగా ఏమీ అధికారాన్ని చేపట్టలేదని షిండే అన్నారు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసే పోటీచేశాయని, తాము దానికే కట్టుబడి ఉన్నామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎ‍న్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి 200 స్థానాల్లో గెలుస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటికే తమ కుటమిలో 170 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇంకో 30 స్థానాలే గెలవాల్సి ఉందని చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతో పెద్ద మనసు చేసుకుని తనకు సీఎం పదవి ఇచ్చి, ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారని షిండే అన్నారు.

>
మరిన్ని వార్తలు