ప్రభుత్వ వైఫల్యాలపై రథయాత్ర! 

24 Aug, 2020 03:33 IST|Sakshi

పార్టీ సీనియర్ల వద్ద ప్రతిపాదించా: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూ, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర నిర్వహించాలని తమ పార్టీ ముఖ్య నాయకుల వద్ద ప్రతిపాదించినట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రథయాత్ర చేయాలని పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతకు చెప్పానని పేర్కొన్నారు. ముందుగా జీహెచ్‌ఎంసీలో ఈ యాత్ర చేయాలని, ఆ తర్వాత మండల కేంద్రాలు, జిల్లాల్లో నిర్వహించాలని సూచించినట్లు వివరించారు.

ఎన్నికల్లో హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు రాబట్టుకోవడం, ఆ తర్వాత వాటిని అటకెక్కించడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిపిస్తే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తానని గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఎన్ని హామీలు ఇచ్చారో ప్రజలకు, తమకు కూడా గుర్తుండటం లేదని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు, 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లాంటి హామీలపై యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని పార్టీ ముఖ్యనేతలను జగ్గారెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు