మీ నీచ రాజకీయాలు రాష్ట్రం మొత్తం తెలుసు బాబూ

12 Nov, 2020 04:21 IST|Sakshi

నంద్యాల ఘటనపై సీఎం వెంటనే స్పందించారు

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు రాష్ట్రం మొత్తం తెలుసని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనీయకుండా అడ్డుకునేందుకు.. రూ.25 కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసులు వేసినందుకు ఆయన పేదలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తే బాబుకు, టీడీపీకి ప్రజలు రాజకీయ సమాధులు కట్టినట్లేనన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తన డబ్బా కొట్టే మీడియా కోసం, దగ్గర ఉండే పది మంది అంతర్జాతీయ బ్రోకర్ల కోసం మాత్రమే చంద్రబాబు పనిచేస్తాడని మండిపడ్డారు.

మతిస్థిమితం లేని వ్యక్తిలా బాబు ప్రవర్తన ఉందన్నారు. చెరువుకు, చేనుకు తేడా తెలియని బండరాయి.. లోకేశ్‌ అని ఎద్దేవా చేశారు. నంద్యాలలో  మైనారిటీ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిసిన వెంటనే బాధ్యులైన సీఐని, హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసి అరెస్టు కూడా చేయించారని, అయితే టీడీపీలో కార్యదర్శిగా పనిచేస్తున్న లాయర్‌ రామచంద్రరావు వారిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చారన్నారు. దీనికి ఏమాత్రం సిగ్గు పడకుండా టీడీపీ నేతలు వృత్తి వేరు.. ప్రవృత్తి వేరంటూ డైలాగులు చెబుతున్నారని మండిపడ్డారు.

ఒక మైనారిటీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే.. కనీసం మానవత్వం లేకుండా నిందితులకు టీడీపీ బెయిల్‌ ఇప్పించిందని దుయ్యబట్టారు. పైగా ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం కులాలు, మతాలను అడ్డుపెట్టుకునే నీచ సంస్కృతి చంద్రబాబుదన్నారు. సీఎంపై పిచ్చి వాగుడు వాగితే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. 

>
మరిన్ని వార్తలు