మెట్టుదిగని డీఎండీకే.. అన్నాడీఎంకేకు తలనొప్పి!

8 Mar, 2021 10:39 IST|Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీట్ల పందేరం కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా డీఎండీకే రూపంలో సమస్య తప్పడం లేదు. తమిళ మానిల కాంగ్రెస్‌కు సోమవారం సీట్ల కేటాయింపు సాగనుంది. చిన్న చిన్న పార్టీలు ఆదివారం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరుసెల్వం, కో కన్వీనర్‌ పళనిస్వామిని కలిసి మద్దతు తెలపడమే కాకుండా, తమకు తలా ఓ సీటు కేటాయించాలన్న విజ్ఞప్తిని ఉంచాయి. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకేకు 23 సీట్లు కేటాయించారు. బీజేపీకి 20 సీట్లను కేటాయించినట్టు సమాచారాలు వెలువడ్డా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  ఈ కూటమిలోని జీకే వాసన్‌ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్, విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకేకు సీట్ల కేటాయింపుల్లో సమస్యలు తప్పడం లేదు. పదిహేను మేరకు సీట్లను వాసన్‌ ఆశిస్తుండగా, పీఎంకేతో సమానంగా సీట్లకు డీఎండీకే పట్టుబడుతున్నట్టు సమాచారం.

ఈ రెండు పార్టీలతో ఆదివారం కూడా చర్చలు సాగాయి. డీఎండీకేకు గతంలో ఉన్నంత బలం ప్రస్తుతం లేదని, పది నుంచి పదిహేనులోపు సీట్లతో సరి పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, ఆ సీట్లను స్వీకరించేందుకు డీఎండీకే ముందుకు రావడం లేదు. మెట్టుదిగే ప్రసక్తే లేదని, తాము ఆశిస్తున్న సీట్లతో పాటు ఓ రాజ్యసభ ఇవ్వాల్సిందేనని డీఎండీకే పట్టుబడుతుండడంతో అన్నాడీఎంకేకు శిరోభారం తప్పడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం విజయకాంత్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఆశావహుల ఇంటర్వ్యూలు సాగడం గమనార్హం. 13 జిల్లాల నుంచి ఆశావహుల్ని విజయకాంత్‌ ఇంటర్వ్యూ చేశారు. అన్నాడీఎంకే పట్టువీడని పక్షంలో ఒంటరి సమరానికి సిద్ధమన్నట్టుగా డీఎండీకే అడుగులు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జీకే వాసన్‌ ఓ మెట్టుదిగినట్టు, సోమవారం సీట్ల కేటాయింపునకు సంతకాలు జరిగే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.  

మేనిఫెస్టో కసరత్తులు.. 
రాయపేటలోని కార్యాలయంలో పన్నీరు, పళని మేనిఫెస్టోకు తుది మెరుగుల  కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. పొన్నయ్యన్‌  కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మేనిఫెస్టోపై  చర్చించి మార్పులు చేర్పులపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల జాబితా తుది కసరత్తులు పూర్తి చేసినట్టు సమాచారం. 

చదవండి: తమిళనాట ఎన్డీయేదే గెలుపు
   

మరిన్ని వార్తలు