Dravid-Allen Donald: 25 ఏళ్ల క్రితం గొడవ.. ద్రవిడ్‌కు అలెన్‌ డొనాల్డ్‌ క్షమాపణ

15 Dec, 2022 18:46 IST|Sakshi

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలెన్‌ డొనాల్డ్‌ .. టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం టీమిండియా బంగ్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌ ముగించుకొని టెస్టు సిరీస్‌ ఆడుతుంది. కాగా బంగ్లాదేశ్‌కు అలెన్‌ డొనాల్డ్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న సంగతి చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో అలెన్‌ డొనాల్డ్‌ ద్రవిడ్‌ను క్షమాపణ కోరాడు.

అదేంటి ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అనే సందేహం రావొచ్చు. అవును ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. కానీ ఇప్పుడు కాదు.. 25 సంవత్సరాల క్రితం. మీరు విన్నది నిజమే. 25 సంవత్సరాల క్రితం జరిగిన గొడవకు అలెన్‌ డొనాల్డ్‌ ఇప్పుడు ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పాడు కాబట్టే ఆసక్తి సంతరించుకుంది. ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పడమే కాదు డిన్నర్‌ కూడా ఆహ్వానించాడు అలెన్‌ డొనాల్డ్‌.

"డర్బన్‌లో జరిగిన ఆ ఘటన గురించి నేను మాట్లాడను. ద్రవిడ్‌, సచిన్‌ మా బౌలర్లను బాదేస్తున్నారు. ఆ సమయంలో నేను కాస్త లైన్ దాటాను. ద్రవిడ్‌పై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ఆ రోజు జరిగిన దానికి నేను మరోసారి ద్రవిడ్‌కు సారీ చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ఏదో అన్నాను. నిజానికి దాని వల్లే అతని వికెట్‌ కూడా పడింది. కానీ ఆరోజు నేను అన్నదానికి క్షమాపణ కోరుతున్నాను. ద్రవిడ్‌ ఓ అద్భతమైన వ్యక్తి. రాహుల్‌ నేను చెప్పేది నువ్వు వింటూ ఉంటే.. నాతో డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను" అని డొనాల్డ్‌ అన్నాడు.

ఈ వీడియోను ఓ ఇంటర్వ్యూలో భాగంగా ద్రవిడ్‌ చూశాడు. డొనాల్డ్‌ సారీ చెప్పడంపై ముసిముసిగా నవ్వాడు. అంతేకాదు అతని ఆహ్వానాన్ని కూడా మన్నించాడు. "కచ్చితంగా వెళ్తాను. దాని కోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా బిల్లు అతడు కడతానంటే ఎందుకు వద్దంటాను" అని ద్రవిడ్‌ నవ్వుతూ చెప్పాడు. మరి 25 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పడు తెలుసుకుందాం.

1997లో ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్‌పై డొనాల్డ్‌ నోరు పారేసుకున్నాడు. తాను ఆడే రోజుల్లో తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించడంతోపాటు నోటికి పని చెబుతూ కూడా డొనాల్డ్ భయపెట్టేవాడు.ఎంతో సౌమ్యుడిగా పేరున్న ద్రవిడ్‌ను కూడా డొనాల్డ్‌ వదల్లేదు. ఆ మ్యాచ్‌లో సచిన్‌, ద్రవిడ్‌ సౌతాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తుండటంతో ఏం చేయాలో తెలియక తాను నోరు పారేసుకున్నానని డొనాల్డ్‌ ఇప్పుడు చెప్పాడు. అంతేకాదు ద్రవిడ్‌కు సారీ కూడా చెప్పడం విశేషం.

అప్పట్లో ముక్కోణపు సిరీస్‌ ఫైనల్లో ఇండియా, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 278 రన్స్‌ చేసింది. కిర్‌స్టన్‌, కలినన్‌ హాఫ్ సెంచరీలు చేశారు. అయితే తర్వాత వర్షం కురవడంతో ఇండియా టార్గెట్‌ను 40 ఓవర్లలో 252 రన్స్‌గా నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లో ద్రవిడ్‌ 94 బాల్స్‌లో 84 రన్స్‌ చేసినా.. ఇండియా లక్ష్యానికి 17 పరుగుల దూరంలో ఆగిపోయింది.

చదవండి: పేరుకు మాత్రమే అమెరికా.. జట్టు మొత్తం మనోళ్లే

కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్‌ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది

మరిన్ని వార్తలు