Kohli-BCCI: 'కోహ్లిపై కోపం తగ్గలేదా'.. బీసీసీఐని ఏకిపారేసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌

1 Mar, 2022 16:20 IST|Sakshi

శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్‌ విజయంపై కన్నేసింది.  రెండు టెస్టు మ్యాచ్‌ సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు మొహలీ వేదికగా జరగనుంది. కాగా టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లికి మొహలీ టెస్టు వందవదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్చి 4 నుంచి తొలి టెస్టు జరగనుంది.

ఇక టీమిండియా క్రికెట్‌ చరిత్రలో కోహ్లిది సువర్ణధ్యాయం. ఎంతకాదనుకున్నా అతను కూడా మేటి బ్యాట్స్‌మెన్లలో ఒకడు. అలాంటి క్రికెటర్‌ వందో టెస్టు ఆడుతుంటే దానిని స్వయంగా చూడాలని భారత క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆశపడ్డారు. కానీ బీసీసీఐ మాత్రం ఫ్యాన్స్‌ ఆశలను అడియాశలు చేసింది. మొహలీ టెస్టుకు ప్రేక్షకులను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. విచిత్రమేంటంటే.. బెంగళూరు వేదికగా జరగనున్న రెండో టెస్టుకు మాత్రం ప్రేక్షకులకు అనుమతి ఉంది. ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కోహ్లిపై తమకున్న కోపాన్ని బీసీసీఐ ఈ విధంగా చూపిస్తుందంటూ పలువురు క్రికెట్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లడానికి ముందు కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంపై బీసీసీఐని మీడియా ముందు ఏకిపారేశాడు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించారంటూ ఆరోపణలు చేశాడు. ఇది మనసులో పెట్టుకొనే బీసీసీఐ కోహ్లి వందో టెస్టుకు ప్రేక్షకులు అనుమతించడం లేదని వాపోయారు. ఒక రకంగా ఇది కోహ్లికి అవమానమేనని.. తన వందో టెస్టును ప్రేక్షకులు లేకుండా ఆడడం తనకు కూడా బహుశా ఇష్టం లేకపోవచ్చని.. కానీ తాను కూడా ఈ విషయంలో ఏం చేయలేని పరిస్థితి అంటూ అభిమానలు మధనపడుతున్నారు.  

ఈ నేపథ్యంలోనే బీసీసీఐని టార్గెట్‌ చేస్తూ మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. ''బీసీసీఐ నిజంగా ఇది సిగ్గుచేటు.. కోహ్లి వందో టెస్టును నిరాడంబరంగా జరపడమేంటి.. అప్పుడు కెప్టెన్సీ నుంచి తొలగించి అవమానించారు.. ఇప్పుడు వందో టెస్టు పేరుతో మరోసారి అవమానిస్తున్నారు... కోహ్లిపై కోపం ఇంకా తగ్గలేదా..''  అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ విరుచుకుపడ్డారు. మరోవైపు రోహిత్‌ శర్మకు టెస్టు కెప్టెన్‌గా ఇదే డెబ్యూ మ్యాచ్‌ కావడం విశేషం. అయితే రోహిత్‌ డెబ్యూ కెప్టెన్సీ టెస్టు మ్యాచ్‌ కంటే కోహ్లి వందో టెస్టుపైపే జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని ఫ్యాన్స్‌ సరదాగా ట్రోల్‌ చేశారు.

చదవండి: IPL 2022: కెప్టెన్సీ విషయంలో నాన్చుడేంది.. అర్థం కాని ఆర్‌సీబీ వైఖరి

రోహిత్ శర్మకు ఏమైంది.. ? ట్విట్టర్ అకౌంట్ నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు

మరిన్ని వార్తలు