Indian Captain: హార్దిక్‌తో పాటు టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ యువ ప్లేయర్‌ కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు!

28 Nov, 2022 13:48 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా- పృథ్వీ షా

India Future Captain Candidates: పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా తదుపరి కెప్టెన్‌ ఎవరన్న అంశంపై గత కొంతకాలంగా క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు సారథిగా ఉన్న రోహిత్‌ శర్మ వయసు(35 ఏళ్లు) దృష్ట్యా, విశ్రాంతి పేరిట వరుస సిరీస్‌లకు అతడు దూరమవుతున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్‌ ఆవశ్యకత గురించి ఇప్పటికే పలువురు మాజీలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

రోహిత్‌ తర్వాత పాండ్యానే!
ఇక ద్వైపాక్షిక సిరీస్‌లలో రోహిత్‌ నేతృత్వంలో అదరగొట్టిన టీమిండియా ఆసియా కప్‌, ప్రపంచకప్‌-2022 టోర్నీల్లో వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ రెండు ప్రధాన టీ20 టోర్నీల్లో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌కు మంచి మార్కులు పడలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్‌ గైర్హాజరీలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా టీ20 జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. 

ఐర్లాండ్‌తో సిరీస్‌ గెలవడం సహా కివీస్‌ గడ్డపై కూడా ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు పాండ్యా. ఈ క్రమంలో త్వరలోనే టీ20 పూర్తి స్థాయి కెప్టెన్‌గా అతడి నియామకం ఖరారు కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మరో కొత్త పేరును తెరమీదకు తెచ్చాడు.

పాపం రోహిత్‌.. పాండ్యాతో పాటు అతడు కూడా రేసులో
ఢిల్లీలో ఆదివారం జరిగిన ఫిక్కీ(ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) ఈవెంట్‌కు గౌతీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా క్రికెట్‌కు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు రాగా.. కెప్టెన్సీ అంశం గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

ఐసీసీ ఈవెంట్‌లో ప్రదర్శనను బట్టి రోహిత్‌ శర్మ కెప్టెన్సీని జడ్జ్‌ చేయడం సరికాదన్న గంభీర్‌.. అతడిపై విమర్శలు దురదృష్టకరం అని పేర్కొన్నాడు. ఇక హిట్‌మ్యాన్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాకు అవకాశం ఉందని గౌతీ అభిప్రాయపడ్డాడు.

జట్టులో చోటే లేదు! కెప్టెనా?
అయితే, పృథ్వీ షా కూడా భావి భారత జట్టు కెప్టెన్‌ కాగల అర్హత కలవాడని గంభీర్‌ పేర్కొనడం విశేషం. కాగా గతేడాది శ్రీలంక పర్యటనలో భాగంగా చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన షా.. ఇప్పటి వరకు మళ్లీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అంతర్జాతీయ టెస్టులాడి కూడా రెండేళ్లకు పైనే అయింది.

ఫిట్‌నెస్‌ లేని కారణంగా
ఇదిలా ఉంటే.. 2019లో యాంటీ- డోపింగ్‌ టెస్టులో విఫలమైన పృథ్వీ షా.. కొన్నాళ్లపాటు క్రికెట్‌ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడంలో విఫలమైన అతడు.. ఈ ఏడాది మార్చిలో యో-యో టెస్టులో విఫలమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ టోర్నీలో సత్తా చాటుతున్నప్పటికీ టీమిండియాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు.

ఇలా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న షా గురించి గంభీర్‌ మాట్లాడుతూ.. ‘‘జట్టు కూర్పు గురించి బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నిజానికి సెలక్టర్లు, కోచ్‌లు ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. 15 మందిని సెలక్ట్‌ చేయడం కాదు.. అందులో ఎవరు సరైన వాళ్లో చూసుకోవాలి. 

అందుకే అతడి పేరు సూచించా
పృథ్వీ షా దూకూడైన కెప్టెన్‌. విజయవంతమైన సారథిగా అతడికి పేరుంది. ఆటగాడిగా కూడా అతడు భేష్‌. అందుకే టీమిండియా భవిష్యత్‌ కెప్టెన్‌గా నేను అతడి పేరును సూచించాను’’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. గంభీర్‌ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు... ‘‘జట్టులో చోటే లేని ఆటగాడు కెప్టెన్‌ అవుతాడా? ఏం మాట్లాడుతున్నావు గంభీర్‌?’’ అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పృథ్వీ షా సత్తా గురించి తెలుసుకాబట్టే గౌతీ ఇలా అన్నాడంటూ అతడి అభిమానులు సమర్థించుకుంటున్నారు.

చదవండి: WC 2023: టీమిండియా ప్రధాన సమస్య అదే! ఉన్నదే 25 మ్యాచ్‌లు.. ఇకనైనా కళ్లు తెరిచి..
Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్‌..

>
మరిన్ని వార్తలు