IND Vs SA 3rd Test 4th Day: లడ్డు లాంటి క్యాచ్‌ వదిలేసిన పుజారా.. మిన్నకుండిపోయిన కోహ్లి

14 Jan, 2022 17:45 IST|Sakshi

Pujara Drops Simple Catch Of Keegan Petersen: దక్షిణాఫ్రికా గడ్డపై తొట్టతొలి టెస్ట్‌ సిరీస్‌ గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజేతులా జారవిడిచింది. నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్‌లో పేలవ ఫీల్డింగ్‌ కారణంగా మ్యాచ్‌ను ప్రత్యర్ధికి వదులుకుంది. ప్రత్యర్ధికి 212 పరుగుల ఫైటింగ్‌ టార్గెట్‌ నిర్ధేశించినప్పటికీ సునాయాసమైన క్యాచ్‌లు వదిలేయడం ద్వారా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.

నాలుగో రోజు ఆట కీలక దశలో(126/2) కీగన్ పీటర్సన్ ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్‌ను పుజారా నేలపాలు చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో పీటర్సన్ బ్యాట్ అంచును ముద్దాడిన బంతి, నేరుగా పూజారా చేతుల్లో ల్యాండైంది. అయితే పూజారా వదిలేసాడు.  ఇది చూసిన కోహ్లి మిన్నకుండిపోయాడు. కాగా, పుజారా.. పీటర్సన్‌ క్యాచ్‌ వదిలేసే సమయానికి దక్షిణాఫ్రికా.. విజయానికి ఇంకా 83 పరుగుల దూరంలో ఉండింది. పీటర్సన్‌ కీలక ఇన్నింగ్స్‌(113 బంతుల్లో 10 ఫోర్లతో 82) ఆడి టీమిండియాకు విజయాన్ని దూరం చేశాడు. 

కాగా, దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సిరీస్‌ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టింద్దామనుకున్న టీమిండియాకు భంగపాటు ఎదురైంది. నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్‌ పీటర్సన్‌(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్‌(41 నాటౌట్‌), బవుమా(32 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు. 

టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్ధూల్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 223, రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్‌ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలువగా, ఆతర్వాత దక్షిణాఫ్రికా వరుసగా రెండు, మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకుంది. సీనియర్ల గైర్హాజరీలో సఫారీ జట్టు అద్భుతంగా రాణించి, టీమిండియాపై చారిత్రక సిరీస్‌ విజయాన్ని నమోదు చేసింది. 
చదవండి: IND Vs SA 3rd Test: విరాట్‌ కోహ్లిపై నిషేధం..?

మరిన్ని వార్తలు