మరోసారి చిక్కుల్లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌

19 Mar, 2021 13:02 IST|Sakshi

కరాచీ: పాకిస్థాన్  కెప్టెన్ బాబ‌ర్ అజమ్‌ మరోసారి చిక్కుల్లో ప‌డ్డాడు. అత‌డు త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేశాడ‌ని గ‌తంలో హమీజా ముఖ్తార్ అనే మ‌హిళ కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆజంతో పాటు ప‌లువురు వ్య‌క్తులు త‌న‌కు వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు పంపిస్తున్న‌ట్లు ఆ మ‌హిళ మ‌రో కేసు పెట్టింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన లాహోర్‌లోని సెష‌న్స్ కోర్టు.. బాబ‌ర్ అజమ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఫెడ‌ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)కి చెందిన సైబ‌ర్ క్రైమ్ స‌ర్కిల్‌ను ఆదేశించింది. త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్న‌ట్లు హ‌మ్‌జా ఫిర్యాదు చేసిన త‌ర్వాత తాము ఫిర్యాదు చేశామ‌ని, ఆ ఫోన్ నంబ‌ర్ల‌లో ఒక‌టి బాబ‌ర్ ఆజంపై పేరుపై ఉన్న‌ద‌ని ఎఫ్ఐఏ కోర్టుకు తెలిపింది. 

మ‌రో రెండు నంబ‌ర్లు ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు చెందిన‌విగా గుర్తించారు. దీనిపై బాబ‌ర్ స్టేట్‌మెంట్ రికార్డు చేయ‌డానికి ఎఫ్ఐఏ కొంత‌కాలం ఆగాల‌ని అత‌ని త‌ర‌ఫున హాజ‌రైన సోద‌రుడు ఫైజ‌ల్ ఆజం కోరాడ‌ని, అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ బాబ‌ర్ మాత్రం రాలేని త‌న రిపోర్ట్‌లో ఎఫ్ఐఏ వెల్ల‌డించింది. దీంతో బాబ‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. గ‌తంలో హమీజా ముఖ్తార్ ఫిర్యాదుపై బాబ‌ర్‌పై కేసు న‌మోదు చేయాల‌న్న సెష‌న్స్ కోర్టు ఆదేశాల‌ను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. అయితే తాజాగా బెదిరింపుల అంశంలో మ‌రోసారి బాబ‌ర్‌పై కేసు న‌మోదు చేయాల‌ని సెష‌న్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా బాబర్‌ అజమ్‌ పాక్‌ తరపున 31 టెస్టుల్లో 2167 పరుగులు, 77 వన్డేల్లో 3580 పరుగులు, 47 టీ20ల్లో 1730 పరుగులు సాధించాడు. ప్రస్తుతం బాబర్‌ అజమ్‌ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
చదవండి:
'పాక్‌ కెప్టెన్‌ నన్ను నమ్మించి మోసం చేశాడు'

'రూ. 45 లక్షలిస్తే కేసు ఉపసంహరించుకుంటా'

మరిన్ని వార్తలు