దిలీప్‌ కుమార్‌@ ఫుట్‌బాల్‌కు వీరాభిమాని

8 Jul, 2021 05:40 IST|Sakshi
రోవర్స్‌ కప్‌ ఫైనల్లో తమ జట్టు ఆటగాళ్లను దిలీప్‌ కుమార్‌కు పరిచయం చేస్తున్న మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ జట్టు కెప్టెన్‌ విక్టర్‌ అమల్‌రాజ్‌

దిలీప్‌ కుమార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆటగాళ్లు

న్యూఢిల్లీ: తెరపై ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన సినీ దిగ్గజం దిలీప్‌ కుమార్‌కు వ్యక్తిగతంగా క్రీడలంటే చాలా ఇష్టం. అందులోనూ ఫుట్‌బాల్‌ అంటే పడి చచ్చే ఆయన ప్రఖ్యాత మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌కు వీరాభిమాని. ఆ జట్టు కోల్‌కతాలో ఆడినా, ముంబైలో ఆడినా ఆయన తప్పకుండా హాజరయ్యేవారని హైదరాబాద్‌కు చెందిన భారత జట్టు మాజీ కెప్టెన్‌ విక్టర్‌ అమల్‌రాజ్‌ గుర్తు చేసుకున్నారు. రోవర్స్‌ కప్, సంతోష్‌ ట్రోఫీ తదితర పెద్ద టోర్నీల మ్యాచ్‌లకు వెళ్లి దిలీప్‌ మ్యాచ్‌లను ఆస్వాదించేవారు. ఈ క్రమంలో జరిగిన ఒక ఘటన గురించి అమల్‌రాజ్‌ చెప్పారు.

‘ఫుట్‌బాల్‌ అంటే బాగా ఇష్టం కాబట్టి 1980 రోవర్స్‌ కప్‌ ఫైనల్‌కు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టడం దిలీప్‌కు కోపం తెప్పించింది. దిలీప్‌ మొహమ్మదాన్‌కు అభిమాని కాగా... ఈస్ట్‌ బెంగాల్‌ అభిమానులు ఆ సమయంలో సూపర్‌ హిట్‌ సినిమా అయిన ‘మర్యాద’ హీరో రాజ్‌కుమార్‌ పేరుతో గొడవ చేస్తుండటంతో ఆయననే అతిథిగా పిలవాల్సిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఎప్పటికీ మరచిపోలేను. వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అయిన దిలీప్‌ కుమార్‌ను కలవడం నా జీవితంలో మరచిపోలేని అనుభవం’ అని అమల్‌రాజ్‌ అన్నారు. మరో ప్రముఖ ఆటగాడు చున్నీ గోస్వామి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పుడు ఆయనను ఒప్పించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో కూడా దిలీప్‌ కుమార్‌ కీలకపాత్ర పోషించారు.  

దిలీప్‌జీ... మీలాంటి మరో వ్యక్తి ఎప్పటికీ రాలేరు. భారత సినిమాకు మీరు చేసిన సేవ అసమానం.
    –సచిన్‌ టెండూల్కర్‌  

భిన్న తరాలు ప్రేమించిన ఒక దిగ్గజం ఇవాళ కన్నుమూశారు. దిలీప్‌సాబ్‌కు నా నివాళి.   
– కోహ్లి  

దిలీప్‌గారే చెప్పినట్లుగా ప్రపంచంలో ఎన్నో విషయాలు మారిపోయినా అందరినీ ప్రేమించే మనసున్నవారు ఎప్పటికీ మారిపోరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.     
–వీరేంద్ర సెహ్వాగ్‌  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు