మళ్లీ ముంబై ఇండియన్స్‌ గూటికి అంబటి రాయుడు

21 Aug, 2023 16:33 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు మరోసారి ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీలో చేరాడు. 2010 నుంచి 2017 వరకు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రాయుడు.. యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 సీజన్‌-2 (2024) కోసం మళ్లీ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌గా బరిలోకి దిగే ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ, వచ్చే సీజన్‌ కోసం 8 మంది కొత్త ఆటగాళ్లతో డీల్‌ కుదుర్చుకుంది. 

వీరిలో రాయుడుతో పాటు కోరె ఆండర్సన్‌ (న్యూజిలాండ్‌), ఓడియన్‌ స్మిత్‌ (వెస్టిండీస్‌), అకీల్‌ హొసేన్‌ (వెస్టిండీస్‌), కుశాల్‌ పెరీరా (శ్రీలంక) లాంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు శ్రీలంక​ యువ ఆటగాడు విజయకాంత్‌ వియాస్‌కాంత్‌, వకార్‌ సలామ్‌కీల్‌, నోష్‌తుష్‌ కెంజిగే లాంటి కొత్త ఆటగాళ్లు కూడా ఎంఐ ఫ్యామిలీలో చేరారు. పై పేర్కొన్న 8 మంది చేరికతో ఎంఐ ఎమిరేట్స్ జట్టు సంఖ్య 20కి చేరింది. 

ఇక ఎంఐ ఫ్యామిలీ రిటైన్‌ చేసుకున్న  ఆటగాళ్ల విషయానికొస్తే.. ‌ఎంఐ ఎమిరేట్స్ 12 మంది పాత వారిని తిరిగి తమతో చేర్చుకుంది. విండీస్‌ ఆటగాళ్లు కీరన్‌ పోలార్డ్‌, డ్వేన్‌ బ్రావో, నికోలస్‌ పూరన్‌, ఆండ్రీ ఫ్లెచర్‌, న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ, ముహ్మమద్‌ వసీం, జహూర్‌ ఖాన్‌, జోర్డన్‌ థాంప్సన్‌, విలియమ్‌ స్మీడ్‌, మెక్‌కెన్నీ క్లార్క్‌, డేనియల్‌ మోస్లీలను ఎంఐ ఎమిరేట్స్‌ తిరిగి రిటైన్‌ చేసుకుంది. కాగా, ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 సీజన్‌-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 

కరీబియన్‌ లీగ్‌ 2023లో రాయుడు..
ఐపీఎల్‌ సూపర్‌ స్టార్‌ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం​ కొద్ది కాలంపాటు గ్యాప్‌ తీసుకుని, ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో రాయుడు సెయింట్‌ కిట్స్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ప్రవీణ్‌ తాంబే తర్వాత కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడుతున్న రెండో భారత క్రికెటర్‌గా రాయుడు రికార్డుల్లోకెక్కాడు. 2020 సీజన్‌లో ప్రవీణ్‌ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ తరఫున సీపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 

మరిన్ని వార్తలు