Ranji Trophy 2022: 3.80 కోట్లు ప‌లికిన‌ ఆట‌గాడు 5 వికెట్ల‌తో అద‌ర‌గొట్టాడు.. కానీ అంత‌లోనే!

5 Mar, 2022 14:53 IST|Sakshi

రంజీ ట్రోఫీలో భాగంగా విద‌ర్భ‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అసోం ఆట‌గాడు రియాన్ ప‌రాగ్ అద్భుత ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. 48 ప‌రుగుల‌తో రాణించ‌డం స‌హా 5 వికెట్లు కూల్చి ఆల్‌రౌండ్ ప్ర‌తిభ‌తో అద‌ర‌గొట్టాడు. వ‌రుస విరామాల్లో వికెట్లు కూల్చి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లు చూపించాడు. 25 ఓవ‌ర్లు బౌలింగ్ వేసిన అత‌డు 68 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

కొర‌క‌రాని కొయ్య‌గా త‌యారైన విద‌ర్భ ఓపెన‌ర్‌, కెప్టెన్ ఫాజ‌ల్(86)ను ఎల్బీడ‌బ్ల్యూగా వెన‌క్కి పంపిన రియాన్.. ఆ త‌ర్వాత అథ‌ర్వ తైడే, స‌తీశ్‌, అక్ష‌య్‌ను వ‌రుస‌గా పెవిలియ‌న్‌కు చేర్చాడు. ఆదిత్య వికెట్‌ను కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

రియాన్ దెబ్బ‌తో విల‌విల్లాడిన‌ విద‌ర్భ 85 ఓవ‌ర్ల‌లో 271 ప‌రుగుల వ‌ద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. అంత‌కు ముందు టాస్ గెలిచిన విద‌ర్భ ఆహ్వానం మేర‌కు బ్యాటింగ్‌కు దిగిన అసోం 316 పరుగుల‌కు ఆలౌట్ అయింది. అసోం బ్యాట‌ర్ల‌లో స్వ‌రూప్ 113 ప‌రుగుల‌తో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అసోంను కోలుకోలేని దెబ్బ కొట్టారు విద‌ర్భ బౌల‌ర్లు.

ర‌జ‌నీశ్ 4, ల‌లిత్ యాద‌వ్ 5 వికెట్లు కూల్చి స‌త్తా చాటారు. దీంతో 110 ప‌రుగుల‌కే అసోం జ‌ట్టు చాప‌చుట్టేసింది. ప్ర‌స్తుతం ఓవరాల్‌గా 155 ఆధిక్యంలో ఉంది. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా రియాన్ ప‌రాగ్‌ను రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 3.80 కోట్ల‌కు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఎలైట్ గ్రూప్ జీ
విద‌ర్భ వ‌ర్సెస్ అసోం
అసోం- తొలి ఇన్నింగ్స్ : 316-10 (92.1 ఓవర్లు)
రెండో ఇన్నింగ్స్ :  110-10 (37.4 ఓవ‌ర్లు)
విద‌ర్భ‌- తొలి ఇన్నింగ్స్ : 271-10 (85 ఓవ‌ర్లు)

చ‌ద‌వండి: IND vs SL: 35 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన జడేజా.. తొలి భారత ఆటగాడిగా!

మరిన్ని వార్తలు