#WillJacks: ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ఆర్‌సీబీ స్టార్‌.. 4 పరుగులతో సెంచరీ మిస్‌

23 Jun, 2023 08:12 IST|Sakshi

సాధారణంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే ప్రపంచ రికార్డుగా పరిగణిస్తారు. అదే ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొడితే దానిని సంచలనం అంటారు. అలాంటి సంచలనం విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో నమోదైంది. సర్రీ బ్యాటర్‌ విల్‌ జాక్స్‌ మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.45 బంతుల్లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 96 పరుగులు చేసిన జాక్స్‌ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు.

కానీ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విల్‌ జాక్స్‌ ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ వేసిన హోల్‌మన్‌కు చుక్కలు చూపించాడు. ఓవర్‌ తొలి బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా.. రెండో బంతిని స్ట్రెయిట్‌ వికెట్‌ మీదుగా.. మేడో బంతిని లాంగాన్‌ మీదుగా.. నాలుగో బంతిని డీప్‌ ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా.. ఐదో బంతిని మరోసారి లాంగాన్‌ మీదుగా తరలించాడు. ఆఖరి బంతిని కూడా సిక్సర్‌ బాదే ప్రయత్నం చేసినప్పటికి కేవలం సింగిల్‌ మాత్రమే రావడంతో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్‌ మిస్సయింది. 

అయితే విల్‌ జాక్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ సర్రీని ఓటమి నుంచి తప్పించలేకపోయింది. 252 పరుగులు చేసిన సర్రీ జట్టు.. టార్గెట్‌ను కాపాడుకోలేకపోయింది. మిడిలెసెక్స్‌ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 254 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించిన జట్టుగా మిడిలెసెక్స్‌ చరిత్ర సృష్టించింది. ఇక ఐపీఎల్‌లో విల్‌ జాక్స్‌ ఆర్‌సీబీ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: సస్పెన్షన్‌ వేటు.. బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ

>
మరిన్ని వార్తలు