T20 WC 2022: తుది జట్టులో డీకే లేదంటే పంత్‌? నేనైతే ఏం చేస్తానంటే: టీమిండియా దిగ్గజం

19 Sep, 2022 16:01 IST|Sakshi

T20 World Cup 2022- Sunil Gavaskar Comments: టీమిండియా వికెట్‌ కీపర్లు దినేశ్‌ కార్తిక్‌, రిషభ్‌ పంత్‌.. ఇటీవలి కాలంలో వీరిద్దరూ జట్టులో స్థానం సంపాదించుకుంటున్నారు. ఆసియా కప్‌-2022 టోర్నీలో పాల్గొన్న జట్టులోనూ ఈ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే, తుది జట్టు కూర్పులో భాగంగా డీకే కంటే కూడా పంత్‌ వైపే యాజమాన్యం ఎక్కువసార్లు మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే.

ఇక టీ20 ప్రపంచకప్‌-2022 జట్టుకు కూడా వీరిద్దరు ఎంపికైన నేపథ్యంలో తుది జట్టులో ఎవరికి అవకాశం వస్తుందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేనైతే ఏం చేస్తానంటే!
తానైతే ఈ మెగా టోర్నీలో డీకే, పంత్‌లకు ఆడే అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు స్పోర్ట్స్‌తక్‌తో గావస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ కీపర్‌గా మొదటి ఎంపిక ఎవరన్న విషయాన్ని పక్కనపెడితే.. పరిస్థితులకు తగ్గట్లుగా.. ప్రత్యర్థి జట్టు బలాబలాలను అంచనా వేసి అత్యుత్తమ తుది జట్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

నిజానికి ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మొదటి మ్యాచ్‌లో డీకేను ఆడించడం మంచి నిర్ణయం. అయితే, అన్నిసార్లు అలా కుదరకపోవచ్చు. నేను మాత్రం అవకాశం ఉంటే.. రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌.. ఈ ఇద్దరికీ తుది జట్టులో అవకాశం ఇస్తాను.

పంత్‌ ఐదో స్థానంలో వస్తే..
రిషభ్‌ పంత్‌ ఐదో స్థానంలో.. హార్దిక్‌ పాండ్యా​ ఆరో స్థానంలో ఆడితే బాగుంటుంది. అదే విధంగా.. దినేశ్‌ కార్తిక్‌ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. హార్దిక్‌ కాకుండా నలుగురు బౌలర్లను ఎంపిక చేసుకుంటా. కొన్నిసార్లు రిస్క్‌ తీసుకుంటేనే గెలుపు సాధ్యమవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌-2022 ఆరంభం కానుంది. అంతకంటే ముందు ఆసీస్‌, దక్షిణాఫ్రికాలతో టీమిండియా స్వదేశంలో వరుస సిరీస్‌లు ఆడనుంది.

చదవండి: Virat Kohli: ఆసీస్‌తో టీ20 సిరీస్‌.. నెట్స్‌లో చెమటోడుస్తున్న కోహ్లి! బలహీనత అధిగమించేలా

Poll
Loading...
మరిన్ని వార్తలు