Mirabai Chanu: దుంగలు మోసి సత్తా చూపింది.. పేరెంట్స్‌ కల సాకారం చేసింది

24 Jul, 2021 13:15 IST|Sakshi

టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత పతకాల వేట మొదలైంది. తక్కువ అంచనాల నడుమే బరిలోకి దిగినప్పటికీ.. సైఖోమ్ మీరాబాయి చాను(26) సిల్వర్‌ మెడల్‌తో మెరిసింది. యావత్‌ దేశంతో ‘శెభాష్‌’ అనిపించుకుంటోంది. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: 1994, ఆగష్టు 8న మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌ దగ్గర్లోకి నాంగ్‌పోక్‌ కక్చింగ్‌లో పుట్టింది Saikhom Mirabai Chanu. ఆమెది మధ్యతరగతి కుటుంబం. వంట కలప కోసం వెళ్లిన టైంలో తన అన్న కంటే ఎక్కువ బరువుల్ని మోసి అందరినీ ఆశ్చర్యపరిచింది మీరాబాయి. అలా చిన్న వయసులోనే ఆమెలోని సామర్థ్యాన్ని గుర్తించింది కుటుంబం. అటుపై కష్టమైనా సరే శిక్షణ ఇప్పించింది. ఎలాగైనా తమ ఊరి పేరును ప్రపంచం మొత్తం మారుమోగేలా చేయాలన్నది ఆమె తల్లిదండ్రుల. అందుకు తగ్గట్లుగా రాణిస్తూ.. పేరెంట్స్ కలలను సాకారం చేస్తూ వస్తోందామె.

కామెన్‌వెల్త్‌ గేమ్స్‌ నుంచి.. 
పదకొండేళ్ల ప్రాయం నుంచే లోకల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిందామె. చానుకి ఫస్ట్‌ బ్రేక్‌ మొదలైంది 2014 గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నుంచి. ఆ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిందామె. 2016లో రియో ఒలింపిక్స్‌ పోటీల కోసం నేషనల్‌ ట్రయల్స్‌లో సత్తా చాటి మీరాబాయి చాను అరుదైన ఘనత సాధించింది. ఏడుసార్లు ఛాంపియన్‌, తాను ఆరాధ్య గురువుగా భావించే కుంజారాణి దేవి రికార్డును చెరిపేసింది మీరాబాయి.

అప్‌ అండ్‌ డౌన్స్‌
2016లో రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం పోటీ పడినప్పటికీ.. ఫెయిల్‌ అయ్యింది. తిరిగి పుంజుకుని 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి.. రెండు దశాబ్దాల తర్వాత ఆ ఫీట్‌ను సాధించిన ఇండియన్‌ వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచింది. ఇది ఆమె కెరీర్‌లో ఓ మైలురాయి అనుకోవచ్చు. 2018 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, 2019లో ఏషియన్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో మెప్పించిన ఆమె.. అయితే 2019 వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో మాత్రం నాలుగో పొజిషన్‌తో సరిపెట్టుకుంది. ఆపై 2020లో సీనియర్‌ నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తన రికార్డును తానే బద్ధలు కొట్టి స్వర్ణంతో మెరుగైన ఫలితంలో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది మీరాబాయి చాను.

తల్లితో మీరాబాయి చాను..


ఫస్ట్‌    
టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయ్‌ చానునే. అంతేకాదు ఏకైక మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ పార్టిసిపెంట్‌ కూడా?!. అంతేకాదు అనుకుంటే సాధించి తీరతానని పట్టుబట్టి బరిలోకి దిగింది. ఒలింపిక్స్‌ 49 కేజీల విభాగంలో మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్‌ పతకాల బోణీని తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచిందామె. 

గౌరవాలు
26 ఏళ్ల మీరాబాయి ఛానుకు గతంలో పలు గౌరవాలు దక్కాయి. కేంద్రం నుంచి పద్మశ్రీతో ఆటు రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలను అందుకుందామె. ప్రస్తుత ఒలింపిక్స్‌ పతక సాధనతో ఆమెకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఆమెను బంగారు కొండగా అభివర్ణిస్తూ నాంగ్‌పోక్‌ కక్చింగ్‌ సంబురాలు చేసుకుంటోంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు