పాకిస్తాన్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌.. మీరు సిద్దంగా ఉండండి: విరాట్‌ కోహ్లి

3 Mar, 2022 10:52 IST|Sakshi

మహిళల ప్రపంచకప్‌-2022 సమరానికి భారత జట్టు సిద్దమైంది. మార్చి 6న భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మిథాలీ సేనకు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మద్దతుగా నిలిచాడు. అంతే కాకుండా సోషల్‌ మీడియా వేదికగా భారత జట్టుకు మద్దతు తెలియజేయాలని అభిమానులను విరాట్‌ కోహ్లి కోరాడు. మిథాలీ రాజ్ నేతృత్వంలోని జట్టు దక్షిణాఫ్రికా,వెస్టిండీస్‌తో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోను విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. 2017 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌.. ఈ సారి ఎలాగైనా గెలిచి తొలిసారి వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలవాలని భావిస్తోంది. ఇక కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోనుంది. 

"భారత జట్టుకు సపోర్ట్‌ చేయడానికి సిద్దంగా ఉండండి. మన మద్దతు తెలియజేయడానికి ఇంతకంటే మంచి సమయం మరి ఉండదు. ఎందుకంటే ఇది ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2022 సమరం. కాబట్టి మార్చి 6 ఉదయం 6.30 గంటలకు అలారమ్‌ సెట్ చేయండి" అని కోహ్లి ట్వీట్‌ చేశాడు. కాగా అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో వుమెన్‌ క్రికెట్‌కు విరాట్‌ మద్దతుగా నిలిచాడు. అదే విధంగా అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ చేరిన యువ భారత జట్టుకు విరాట్‌ కోహ్లి విలువైన సలహాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అండర్ 19 ప్రపంచకప్‌ను భారత్‌ కైవసం చేసుకుంది.

చదవండి: Womens ODI World Cup 2022: ప్రపంచ కప్‌ సమరానికి సై.. భారత్‌ తొలి మ్యాచ్‌లోనే..

మరిన్ని వార్తలు