ఔరా.. ఎలుకల మహత్యం!

5 Jul, 2023 12:08 IST|Sakshi

సాక్షి, చైన్నె: ఎలుకల పుణ్యమా అంటూ గంజాయి కేసు నుంచి ఇద్దరు నిందితులు విడుదలయ్యారు. పట్టుబడ్డ గంజాయిలో సగానికి సగం ఎలుకలు తినేయడం, పోలీసులు కోర్టుకు ఆధారాలు సమర్పించక పోవడంతో కేసు కొట్టి వేస్తూ నిందితులను మంగళవారం మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. వివరాలు.. రెండేళ్ల క్రితం మెరీనా బీచ్‌ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లుగా ఆ ప్రాంతానికి చెందిన రాజగోపాల్‌, నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసు విచారణ చైన్నె హైకోర్టు ఆవరణలోని మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రత్యేక కోర్టులో సాగుతూ వచ్చింది.

చార్జ్‌షీట్‌లో ఆ ఇద్దరి నుంచి 22 కేజీలు పట్టుకున్నట్లు మెరీనా పోలీసులు కోర్టుకు వివరించారు. ఇందులో కొంత పరిశోధనకు పంపించగా, మిగిలిన 21 కేజీల 900 గ్రామాలను భద్రత పరిచామని పేర్కొన్నారు. అయితే కోర్టుకు విచారణ సమయంలో పట్టుబడ్డ మొత్తం గంజాయి కాకుండా కేవలం 11 కేజీలు మాత్రమే సమర్పించారు. మిగిలిన గంజాయి ఎక్కడఅని కోర్టు ప్రశ్నించగా, ఎలుకలు తినేసినట్టు మెరీనా పోలీసులు సమాధానం ఇవ్వడం ఇటీవల చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో ఈకేసు తుది విచారణ ముగియడంతో మంగళవారం తీర్పు వెలువడింది.

చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లుగా గంజాయిని కోర్టులో సమర్పించిక పోవడం, ఆధారాలు సరిగ్గా లేక పోవడంతో కేసును కోర్టు కొట్టి వేసింది. ఇద్దరు నిందితులను విడుదల చేసింది. ఎలుకల పుణ్యమా ఈఇద్దరు జైలు శిక్ష నుంచి బయట పడటం గమనార్హం. ఇదిలా ఉండగా ఇటీవల కోయంబేడు పోలీసులు పట్టుకున్న 33 కేజీల గంజాయిలో 19 కేజీలను ఎలుకలు తినేసినట్టుగా కోర్టుకు వివరాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు బయటపడ్డారు. అదే సమయంలో పట్టుబడ్డ గంజాయిని భద్ర పరచడంలో పోలీసులు విఫలమయ్యారా? లేక ఎలుకల పేరిట గంజాయిని బయటకు పంపించి సొమ్ము చేసుకున్నారా? అనే పోస్టులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు