పొన్ముడికి ఈడీ సమన్లు | Sakshi
Sakshi News home page

పొన్ముడికి ఈడీ సమన్లు

Published Sat, Nov 25 2023 12:56 AM

పొన్ముడి, గౌతం శిఖామణి  - Sakshi

సాక్షి, చైన్నె: క్వారీలలో అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడిని ఈడీ టార్గెట్‌ చేసింది. ఈనెల 30న ఆయన్ను విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో ఆయన వారసుడు, ఎంపీ గౌతం శిఖామణి చైన్నె ప్రత్యేక కోర్టు విచారణకు శుక్రవారం హాజరయ్యారు. మంత్రి పొన్ముడి, ఆయన తనయుడు గౌతం శిఖామణిని టార్గెట్‌ చేస్తూ ఇదివరకు రాష్ట్రంలో జరిగిన ఈడీ సోదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2006–2011 కాలంలో మంత్రిగా ఉన్న సమయంలో తన అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని క్వారీలలో ఎర్రమట్టిని ఇష్టానుసారంగా తవ్వేసుకున్నట్టు పొన్ముడిపై గతంలో దాఖలైన ఏసీబీ కేసు అస్త్రంగా ఈడీ రంగంలోకి దిగింది. ఈ అక్రమార్జనతో రూ.28 కోట్లు ఆర్జించి విదేశీ సంస్థలతో పెట్టుబడులు పేరిట మనీ లాండరింగ్‌ పాల్పడినట్టు తేల్చింది. దీంతో చైన్నె, విల్లుపురం, విక్రవాండి ప్రాంతాలలో జరిగిన సోదాలలో రూ. 41.9 కోట్ల విలువగల ఆస్తులకు సంబంధించిన రికార్డులు, రూ.81 లక్షల నగదు పట్టుబడినట్టు తెలిసింది. ఈ నగదులో రూ. 13 లక్షలు విదేశీ కరెన్సీ ఉన్నట్టు ఈడీ వర్గాలు ప్రకటించాయి. క్వారీల ద్వారా అక్రమార్జనతో సౌదీ అరేబియా, ఇండోనేషియా సంస్థల ద్వారా విదేశీ పెట్టుబడులు దొడ్డి దారిన వచ్చినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే పొన్ముడి, గౌతం శిఖామణిలను ఈడీ విచారించింది.

సమన్లు...చర్చ

మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు కేసును మరింతగా విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో పొన్ముడిని మరలా టార్గెట్‌ చేశారు. ఆయన్ను తీవ్రంగా విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 30న చైన్నెలోని తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. విదేశీ నగదు పట్టుబడిన వ్యవహారంపై ఆయన వద్ద విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసినట్టు తెలిసింది. అసలే రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని టార్గెట్‌ చేసి పొన్ముడి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఈడీ సమన్లు, విచారణ పొన్ముడిని ఇరకాటంలో పడేసేనా, లేదా కేసు ఏదేనీ మలుపు తిరగబోతోందో అనే చర్చ జోరందుకుంది.

కోర్టుకు గౌతం శిఖామణి..

మనీ లాండరింగ్‌ కేసు విచారణ నిమిత్తం చైన్నె ప్రత్యేక కోర్టు విచారణకు శుక్రవారం మధ్యాహ్నం ఎంపీ గౌతం శిఖామణి హాజరయ్యారు. కోర్టులో ఈడీ చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన విచారణకు రావడంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది. న్యాయమూర్తి ఎదుట హాజరైన గౌతం శిఖామణి తన తరఫున వాదనను ఉంచినట్టు సమాచారం. అలాగే, ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ నకలును కోర్టు ద్వారా ఆయన అందుకున్నారు. ఇందులోని అంశాలను పరశీలించిన అనంతరం తర్వాత విచారణకు గౌతం శిఖామణి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

30న విచారణకు హాజరుకావాలని ఆదేశం

కోర్టుకు వారసుడు

చార్జ్‌షీట్‌ నకలు అప్పగింత

Advertisement

తప్పక చదవండి

Advertisement