సాయం కోసం ఎదురుచూపు | Sakshi
Sakshi News home page

సాయం కోసం ఎదురుచూపు

Published Sat, Nov 25 2023 12:56 AM

ఊటీ మార్గంలో చీలిన రోడ్డు   - Sakshi

సాక్షి, చైన్నె: నీలగిరుల్లో కురిసిన అతి భారీ వర్షంతో అనేక అటవీ గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆ గ్రామాల ప్రజలు బయటకు రాలేక అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామాలకు సహాయక చర్యలు కష్టతరంగా మారాయి. అయినా, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంగళవారం నీలగిరి జిల్లాలోని కోత్తగిరి, కున్నూరు పరిసరాలను, కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయంను అతి భారీ వర్షం ముంచెత్తిన విషయం తెలిసిందే. ఊటీ వైపు మార్గాలన్నీ మూసుకెళ్లడంతో రేయింబవళ్లు అధికారులు సహాయక చర్యల్లో మునిగారు. వర్షం పడుతుండడంతో మట్టి చరియలు, కొండ చరియలు ఎక్కడికక్కడ విరిగి పడుతుండడంతో రవాణాకు తీవ్ర ఆటంకాలు తప్పడం లేదు. నీలగిరులలోని వర్షం దాటికి 50 ఇళ్లు నేలమట్టమైనట్టు పరిశీలనలో తేలింది. అలాగే, 25 అటవీ గ్రామాల మధ్య పూర్తిగా సంబంధాలు తెగిన పరిస్థితి నెలకొంది. వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో ఆయా గ్రామాలకు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో అక్కడి ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. వీరికి సహాయకులను అందించేందుకు అధికారులు పరుగులు తీస్తున్నారు. కున్నూరు–మేట్టుపాళయం మార్గంలో విరిగిపడ్డ కొండ చరియలను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇదిలాఉండగా తేని వర్షాలకు వైగై జలాశయం నిండిన విషయం తెలిసిందే. వైగై నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో మదురై మీదుగా వైగై నది పరవళ్లు తొక్కుతోంది. నగరం నడిబొడ్డన ప్రవహించే వైగై నదిలో నీటి ఉధృతి కారణంగా అటు వైపు వెళ్లే మార్గాలను మూసివేశారు. నీటి ఉధృతిని చూసేందుకు జనం తరలి వస్తుండడంతో ఉత్కంఠ తప్పడం లేదు.

27న అల్పపీడనం..

చైన్నె శివారులోని కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలో శనివారం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నా యని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెంగల్పట్టులో ముందు జాగ్రత్తగా బడులకు సెలవు ప్రకటించేశారు. ఈ పరిస్థితులలో ఈనెల 27వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం తమిళనాడు మీద అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. నాగపట్నం, కడలూరు జిల్లాల జాలర్లకు మాత్రం చేపట వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లొద్దనే హెచ్చరికలు జారీ అయ్యాయి.

నీలగిరుల్లో కొనసాగుతున్న

సహాయక చర్యలు

మదురైలో వైగై పరవళ్లు

ట్రిప్లికేన్‌ భారతీసాలై రోడ్డులో
కూలిన ఇల్లు, సహాయక సిబ్బంది
1/1

ట్రిప్లికేన్‌ భారతీసాలై రోడ్డులో కూలిన ఇల్లు, సహాయక సిబ్బంది

Advertisement
Advertisement