Sakshi News home page

లోక్‌సభకు ఎన్నికల అధికారులు

Published Sat, Nov 25 2023 12:56 AM

సత్యప్రద సాహు   - Sakshi

● నియోజకవర్గాల వారీగా నియామకం ● కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు

సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని 39 లోక్‌సభ నియోజక వర్గాలకు ఎన్నికల అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు మెజారిటీ శాతం నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులుగా నియమితులయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్య ప్రద సాహు వేగవంతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒకే విడతగా ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు ప్రస్తుతం అవకాశం కల్పించారు. శని, ఆదివారాలలో చివరి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు శిబిరాలు జరగనున్నాయి. తుది ఓటరు జాబితాను జనవరిలో ప్రకటించేందుకు చర్యల్లో వేగం పెంచారు. అదే సమయంలో ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాట్లను వేగవంతం చేయించేందుకు నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎన్నికల అధికారులు..

రాష్ట్రంలో 39 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రాజధాని నగరం చైన్నె కార్పొరేషన్‌ పరిధిలో ఉత్తరం, సెంట్రల్‌, దక్షిణ చైన్నెలుగా మూడు లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి చైన్నె కార్పొరేషన్‌లోని సీనియర్‌ అధికారులు ముగ్గురిని ఎన్నికల అధికారులుగా నియమించారు. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ రూపుదిద్దుకున్న శ్రీపెరంబదూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా చెంగల్పట్టు కలెక్టర్‌ నియమితులయ్యారు. కాంచీపురం పేరిట ఉన్న మరో లోక్‌సభ నియోజకవర్గానికి ఆ జిల్లా కలెక్టర్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. తిరువణ్ణామలై జిల్లా పరిధిలోని ఆరణి లోక్‌సభకు ఆ జిల్లా రెవిన్యూ అధికారి, తిరువణ్ణామలై పేరిట ఉన్న మరో లోక్‌సభకు ఆ జిల్లా కలెక్టర్‌, రాణిపేట జిల్లా పరిధిలోని అరక్కోణం నియోజకవర్గానికి ఆ కలెక్టర్‌ , కోయంత్తూరు జిల్లా పొల్లాచ్చి లోక్‌సభ నియోజకవర్గానికి ఆ జిల్లా సబ్‌ కలెక్టర్‌, కోయంబత్తూరు పేరిట ఉన్న మరో లోక్‌సభ నియోజకవర్గానికి ఆ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే , కడలూరు జిల్లా కేంద్రం పేరిట ఉన్న లోక్‌సభకు ఆ జిల్లా కలెక్టర్‌, ఇదే జిల్లా పరిధిలోని చిదంబరం లోక్‌సభకు ఆ జిల్లా రెవెన్యూ అధికారి ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. మిగిలిన తిరువళ్లూరు, వేలూరు, కృష్ణగిరి, ధర్మపురి, విల్లుపురం, కళ్లకురిచ్చి, సేలం, నామక్కల్‌, ఈరోడ్‌, తిరుప్పూర్‌, నీలగిరి, దిండుగల్‌, కరూర్‌, తిరుచ్చి, పెరంబలూరు, మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, శివగంగై, మదురై, తేని, విరుదునగర్‌, రామనాథపురం, తూత్తుకుడి, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా ఉంటారు. ఆయా లోక్‌సభ నియోజక వర్గాలలో ఎన్నికల ప్రక్రియలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఈ అధికారులే పర్యవేక్షించనున్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారుల నియామకంతో ఇక పనుల వేగం మరింతగా పెరగనున్నాయి. నియోజకవర్గ ఎన్నికల అధికారులతో ఎన్నికల ప్రధాన అధికారి సత్యప్రద సాహు సోమవారం తర్వాత సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement