వైద్యులూ.. వెల్‌డన్‌

29 Jan, 2022 03:16 IST|Sakshi
గోదావరిఖని ఆస్పత్రిలో కరోనా సోకిన గర్భిణికి పురుడు పోసిన వైద్య సిబ్బంది

కరోనా సోకిన ముగ్గురికి కాన్పు

మానవత్వం చాటుకున్న ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు 

గోదావరిఖని, ఆసిఫాబాద్‌ ఆసుపత్రుల్లో క్షేమంగా తల్లులు, శిశువులు

కోల్‌సిటీ(రామగుండం)/ఆసిఫాబాద్‌ అర్బన్‌: కరోనా సోకిన ముగ్గురు గర్భిణులకు కాన్పులు చేసి విధి నిర్వహణపట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నారు ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది. అందరికీ ఆదర్శంగా నిలిచిన గోదావరిఖని, ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందిని పలువురు అభినందించారు. మంథని మండలం వెంకటాపూర్, అంతర్గాం మండలం మర్రిపల్లికి చెందిన ఇద్దరు గర్భిణులకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. కరోనా టెస్టులు చేయగా వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకరి తర్వాత మరొకరికి వైద్యులు కాన్పులు చేశారు.

రిస్క్‌ కేస్‌ అయినప్పటికీ గైనకాలజిస్టు డాక్టర్‌ కల్యాణి, అనస్తీషియా డాక్టర్‌ మోహన్‌రావు, స్టాఫ్‌నర్స్‌ రుద్రమ పీపీఈ కిట్లు ధరించి ఆ గర్భిణులకు ప్రత్యేక ఆపరేషన్‌ థియేటర్‌లో సిజేరియన్‌ చేశారు. ఇద్దరికీ ఆడశిశువులే జన్మించారు. తల్లులు, శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని, వారిని కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, ఆసిఫాబాద్‌ మండలం అంకుసాపూర్‌ గ్రామానికి చెందిన జాడి సింధూజకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

గురువారం సాయంత్రం 5 గంటలకు కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించగా సిబ్బంది అంబులెన్‌లో తీసుకెళ్లి రాత్రి 7 గంటలకు అడ్మిట్‌ చేసుకున్నారు. రాత్రి పురిటినొప్పులు రావడంతో సూపరింటెండెంట్‌ స్వామి సూచనల మేరకు డాక్టర్‌ నవీద్, స్టాఫ్‌ నర్సులు ప్రీత, సుదీవన పీపీ కిట్‌లు ధరించి, కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పు చేశారు. సుఖ ప్రసవం చేసిన వైద్య సిబ్బందికి గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు