గజ్వేల్‌ నియోజకవర్గంలో ‘దళితబంధు’ కోసం రోడ్డెక్కిన దళితులు

14 Aug, 2023 05:44 IST|Sakshi
సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దళితులు

సీఎం దిష్టిబొమ్మ దహనం 

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌ జిల్లా గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితులు రోడెక్కారు. దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం దళితులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. దళితబంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తిగుల్, నిర్మల్‌నగర్, బస్వాపూర్, అలిరాజ్‌పేట గ్రామాల దళితులు ఆందోళన చేశారు. జగదేవ్‌పూర్‌ –భువనగిరి ప్రధాన రహదారిపై గంటసేపు నిర్మల్‌ నగర్‌ దళితులు రాస్తారోకో చేపట్టారు. ధర్నా కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర అటుఇటు వాహనాలు నిలిచిపోయాయి.

ఎస్‌ఐ చంద్రమోహన్‌ దళితులతో మాట్లాడి సముదాయించి ధర్నాను విరవింపజేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఎదుట సర్పంచ్‌కు వ్యతిరేకంగా దళితులు నిరసన చేపట్టారు. తిగుల్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో దళితులు బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. బస్వాపూర్‌లోనూ దళితులు నిరసన తెలిపారు. అలిరాజ్‌పేటలో దళితులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల దళితులు మాట్లాడుతూ దళితబంధును అర్హులందరికీ ఇవ్వాలని, లేదంటే ఎవరికీ ఇవ్వకూడదని అన్నారు.

మరిన్ని వార్తలు