చికెన్‌ తినలేం.. మటన్‌ గురించి మాట్లాడలేం 

24 Oct, 2020 08:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పండగ వేళ నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. మార్కెట్‌లో కూరగాయల దగ్గరనుంచి పప్పులు, నూనెలు, చక్కెర, బెల్లం ధరలు అమాంతం పెరిగిపోయాయి. గుడ్లు, చికెన్, మటన్‌ ధరలది సైతం అదే పరిస్థితి. సాధారణ రోజులతో పోల్చితే ప్రస్తుతం ప్రతి వస్తువు మీదా సుమారు రూ.10–25 వరకు ధరలు అధికమయ్యాయి. దీంతో సామాన్యుల బతుకులు భారంగా మారాయి. మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా లేకపోవడం.. సరిపడాస్టాక్‌ ఉన్నా కొంతమంది దళారులు, వ్యాపారుల కుమ్మకై సరుకులను బ్లాక్‌ చేయడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా  సామాన్య ప్రజానీకం వివిధ రాకల వంటలకు దూరమవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై రూ. 600 నుంచి రూ. 1,000 వరకు అదనపు భారం పడుతోంది. 

ఘాటెక్కిన ఉల్లి.. 
ఉల్లి కొనలేని పరిస్థితి నెలకొంది. వారం రోజుల క్రితం మొదటి రకం కిలో రూ.60ఉండగా, ఇప్పుడు రూ. 80 నుంచి రూ. 100 వరకు విక్రయిస్తున్నారు. రెండో, మూడో రకం ఉల్లిపాయలు రూ. 50 నుంచి రూ.60 కి విక్రయిస్తున్నారు. మెస్‌లు, రెస్టారెంట్లలో ‘నో ఆనియన్‌’ బోర్డులు తగిలించారు. ఉల్లిపాయ కావాలంటే అదనంగా రూ. 20 చార్జీ చేస్తున్నారు. ఆనియన్‌ ఆమ్లెట్, ఆనియన్‌ దోసె వంటివి అమ్మడం లేదు. 

సన్‌ఫ్లవర్, పామాయిల్‌ ధరలు పైపైకి... 
‘రిటైల్‌’లో రిఫైండ్‌ ఆయిల్‌ 110, పామాయిల్‌ 95 ధరలు పలుకుతున్నాయి.  తాళింపు పెట్టకముందే వంట నూనె ‘గరం’ అవుతోం ది.   ఏడాది క్రితం 85–90 మధ్య ధరల్లో ఉన్న వివిధరకాల వంటనూనెలు ఇప్పుడు ‘సెంచరీ’ దాటాయి.  

కూర ‘గాయాలే’ 
కూరగాయల ధరలూ విపరీతంగా పెరిగిపోయాయి. ఏ కూరగాయ కొందామన్నా కిలో రూ. 50 నుంచి రూ. 60 పలుకుతోంది. పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతి తదితర ఆకుకూరల ధరలు కూడా మండుతున్నాయి. రూ. 5కు ఐదు కట్టలు అమ్మిన పాలకూర ఇప్పుడు రెండు కట్టల చొప్పున అమ్ముతున్నారు. 

పరుగులు పెడుతున్న పప్పులు.. 
పప్పుల ధరలు ఆకాశం వైపు పరుగులు పెడుతున్నాయి. నిన్న ఉన్న ధర నేడు ఉండడం లేదు. మూడు నెలల క్రితం ఉన్న పప్పుల ధరలతో పోల్చుకుంటే ప్రస్తుతం 25 శాతం పెరిగాయి. గత నెలకంటే ఈ నెలలో ఎక్కువగా పెరిగిందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పెసర, కందిపప్పు రూ. వందకు పైన పెడితే కానీ, కిలో రావడం లేదు. కందిపప్పు కిలో రూ. 100 నుంచి రూ. 120 వరకు పలుకుతోంది. 

భయపెడుతున్న బియ్యం 
బియ్యం ధరలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మంచి రకం బియ్యం కిలో రూ. 45 నుంచి రూ.55 వరకు అమ్ముతున్నారు. ఇక సోనామసూరి, కర్నూల్‌ మసూరి, వరంగల్, సోనా రత్న, సూపర్‌ఫైన్, ఫైన్‌ రైస్‌ వంటి రకాల బియ్యం ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిపోయాయి. నూకలు తిందామన్నా కిలో రూ.15 పైనే ఉన్నాయి.

చేదెక్కిన చక్కెర 
చక్కెర కిలో రూ. 40 ఉంది. పావు, అర కిలో చొప్పున కొనుగోలు చేస్తే మాత్రం కిలో రూ. 50 చొప్పున విక్రయిస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేసే చక్కెర కోటాను తగ్గించడంతో సామాన్యులు కిరాణా దుకాణాల్లో చక్కెరను కొనుగోలు చేయాల్సి వస్తోంది. 

చికెన్‌ తినలేం.. మటన్‌ గురించి మాట్లాడలేం 
చికెన్‌ ధర మండిపోతోంది. మార్కెట్‌లో కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.250 నుంచి రూ.260 పలుకుతోంది. మటన్‌ ధరలు రూ. 650 ఉండగా పండుగ పూట్‌ మార్కెట్‌కు మేకలు, గొర్రెల దిగుమతులు లేకపోవడంతో ధరలు విపరీతంగా పెంచారు. దీంతో కిలో మటన్‌ రూ. 750 నుంచి 800 వరకు విక్రయిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు