ప్రీతి ఘటనపై వివరాలివ్వండి 

4 Mar, 2023 01:52 IST|Sakshi

కేఎంసీ ప్రిన్సిపాల్‌కు గవర్నర్‌ లేఖ 

కళాశాలలో ర్యాగింగ్‌ నిరోధానికి ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశం

ఎంజీఎం: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల (కేఎంసీ) పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై కళాశాల ప్రిన్సిపల్‌ మోహన్‌దాస్‌ను ఆదేశించారు.

ప్రీతి ఆత్మహత్యకు ముందు కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రిలో ఏం జరిగింది? ప్రీతికి కౌన్సెలింగ్‌ నిర్వహించిన వైద్యులు ఎవరు? ప్రీతి ఆత్మహత్యకు అనస్తీషియా తీసుకోవడమే కారణమా? ఎంజీఎంలో ఎలాంటి వైద్యం అందించారు? ఎవరి సూచన మేరకు ఆమెను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు? అనే అంశాలను కూడా నివేదించాలని ఆదేశించారు.

అలాగే, ఐదేళ్ల కాలంలో కళాశాలలో ఏమైనా ర్యాగింగ్‌ ఘటనలు జరిగాయా? కళాశాలలో ర్యాగింగ్‌ జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.. లాంటి వివరాలు కూడా ఇవ్వాలని గవర్నర్‌ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు అన్ని వివరాలను నివేదిస్తామని కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాస్‌ పేర్కొన్నారు. 

ఎంజీఎంలో రెఫరల్‌ వైద్యమా? 
ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో రెఫరల్‌ వైద్యం పేరుతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే విషయంపై గవర్నర్‌ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆస్పత్రిలో సదుపాయాలు, వైద్యుల కొరత ఉందా? అనే అంశంపైనా ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, బాధితులను హైదరాబాద్‌కు తరలించే విధానంపైనా నివేదిక పంపాలని కోరారు.

>
మరిన్ని వార్తలు