బెంగళూరు ఎకానమీ చైర్‌కార్‌ చార్జి రూ.1,600

24 Sep, 2023 03:45 IST|Sakshi

ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌ ధర రూ. 2,915

నేడు వందేభారత్‌ రైలు ప్రారంభం

రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌: కాచిగూడ–యశ్వంతపూర్‌ (బెంగళూరు) వందేభారత్‌ రైలు (నం.20703) టికెట్‌ చార్జీలను దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. కాచిగూడ నుంచి యశ్వంతపూర్‌ స్టేషన్‌కు ఎకానమీ చైర్‌ కార్‌లో క్యాటరింగ్‌ రుసుముతో కలుపుకొని రూ.1,600గా నిర్ణయించారు.

క్యాటరింగ్‌ చార్జి లేకుండా సాధారణ ప్రయాణానికి రూ.1,255, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ కోచ్‌లో ప్రయాణానికి క్యాటరింగ్‌ చార్జీతో కలుపుకొని రూ. 2,915గా, కేటరింగ్‌ చార్జీ లేకుండా 2,515గా నిర్ధారించారు. యశ్వంతపూర్‌ నుంచి కాచిగూడ (నం.20704)కు ఈ ధరల్లో స్వల్ప తేడా ఉంది. ఎకానమీ చైర్‌ కార్‌లో కేటరింగ్‌ చార్జీలతో కలిపి రూ.1,540, కేటరింగ్‌ చార్జీ లేకుండా రూ.1,255, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ కోచ్‌లో కేటరింగ్‌ చార్జీతో కలిపి రూ.2,865, కేటరింగ్‌ చార్జీ లేకుండా రూ.2,515గా నిర్ణయించారు.

రైల్లో అల్పాహారం, లంచ్‌: ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో ప్రారంభమయ్యే వందేభారత్‌ రైలు మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంతపూర్‌ చేరుకుంటుంది. కేటరింగ్‌ చార్జీతో కలిపి టికెట్‌ బుక్‌ చేసుకున్నవారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్‌ను రైల్లో అందిస్తారు. కేటరింగ్‌ రుసుము చెల్లించని వారికి అవి అందవు. ఇంటి నుంచి తెచ్చుకునే భోజనాన్ని రైల్లోకి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఈ కొత్త వందేభారత్‌ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆదివారం సాధారణ ప్రయాణికులను అనుమతించరు. సోమవారం నుంచి సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌ను ఐఆర్‌సీటీసీ ప్రారంభించింది.
 

మరిన్ని వార్తలు