Hyderabad Metro Rail: ఇంత దారుణమా.. మనుషులమేనా?!

25 Oct, 2021 21:21 IST|Sakshi

మెట్రో రైలులో పసిబిడ్డతో కిందే కూర్చున్న మహిళ

సోషల్‌ మీడియాలో వైరలవుతున్న వీడియో

ప్రయాణికుల ధోరణిపై విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌: మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు చూస్తే.. గుండె కలుక్కుమంటుంది. మనం మనుషుల మధ్య ఉన్నామా.. లేక రాక్షసుల మధ్య జీవిస్తున్నామో అర్థం కాదు. మరీ ముఖ్యంగా లోకల్‌ బస్సులు, ట్రైన్‌లలో ఇలాంటి అమానవీయ సంఘటనలు ఎక్కువగా తారసపడుతుంటాయి. ఎదురుగా వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లులు, గర్భవతులు ఉన్నా సరే.. సీట్లలో కూర్చున్న వారికి అయ్యో పాపం అనిపించదు. 

వారికి సీటు ఇచ్చి.. నిల్చుంటే.. ఎంతో విలువైన సంపద కోల్పోయినట్లు భావిస్తారు. తాజాగా ఇలాంటి హృదయవిదారక దృశ్యం ఒకటి హైదరాబాద్‌ మెట్రోలో చోటు చేసుకుంది. ఓ మహిళకు కూర్చోడానికి సీటు దొరక్కపోవడంతో చంటి బిడ్డను తీసుకుని కిందనే కూర్చుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు.
(చదవండి: మెట్రో: అపోలో ఆస్పత్రికి చేరుకున్న గుండె)

ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. మహిళకు ఎదురుగా రెండు పక్కలా కూర్చున్న వారంతా ఆడవాళ్లే. వాళ్లలో ఒక్కరికి కూడా ఈ మహిళ మీద జాలి కలగలేదు. మాకేందుకు అనే ధోరణిలో చెవిలో హెడ్‌ఫోన్స్‌ తగిలించుకుని.. మొబైల్‌ ఫోన్స్‌లో బిజీగా గడిపేశారు. ఒక్కరు కూడా ఆమెకు సీటు ఇవ్వడానికి ముందుకు రాలేదు. 
(చదవండి: ఆమె కోసం మెట్రో పరుగు!)

ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే దాని గురించి వివరాలు లేవు. కానీ ఈ వీడియో చూసిన నెటిజనుల ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం కరోనా భయం వల్ల ఆ మహిళ కావాలనే కింద కూర్చుందోమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పసిబిడ్డతో ఆ మహిళ అలా కింద కూర్చోవడం చూస్తే.. చాలా బాధగా అనిపిస్తుంది అంటున్నారు నెటిజనులు. 

చదవండి: అందుకే మెట్రో రైలుకు ఆర్థిక నష్టాలు: కేటీఆర్‌

మరిన్ని వార్తలు