చలి తగ్గుతోంది!

29 Nov, 2020 10:26 IST|Sakshi

తుపాను బలహీనపడటంతో క్రమంగా సాధారణ స్థితికి..

రెండ్రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

నివర్‌ ప్రభావంతో మూడు రోజులుగా తగ్గిన ఉష్ణోగ్రతలు

పగటి ఉష్ణోగ్రతల్లో గరిష్టంగా 8.6 డిగ్రీలు తగ్గుదల

రాత్రి ఉష్ణోగ్రతల్లో స్వల్ప వ్యత్యాసంతో నమోదు

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో తగ్గిన ఉష్ణో గ్రతలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటు న్నాయి. తుపాను నేపథ్యంలో గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. నివర్‌ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేనప్పటికీ... వాతావరణంలో మాత్రం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధ, గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు చలిగాలులు వీయడంతో ప్రజలు వణికిపోయారు. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి చలి తీవ్రత తగ్గుతోంది. మరో రెండు రోజుల్లో చలి తగ్గి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారి నాగరత్న ‘సాక్షి’తో అన్నారు. 

సాధారణం కన్నా 8.6 డిగ్రీలు తక్కువగా...
నివర్‌ తుపాను ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8.6 డిగ్రీ సెల్సియస్‌ తగ్గాయి. దీనికితోడు వేగంగా గాలులు వీయడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సమీపంలో ఉండాల్సి ఉండగా... హకీంపేట్‌లో 21.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, భద్రాచలం, దుండిగల్, హన్మకొండ స్టేషన్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోద య్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు  కాస్త అటుఇటుగా నమోదయ్యాయి. రాష్ట్రంలో అతి తక్కువగా మెదక్‌లో 14.8 డిగ్రీల సెల్సీయస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, దుండిగల్, హకీంపేట్, హైదరాబాద్‌లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యాయి.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగు తోందని వివరించింది. రాబోయే 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారి పశ్చిమ దిశగా పయనిస్తూ డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని సూచించింది. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం బలహీన పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది.
   
శనివారం ఉదయం 8:30 గం. వరకు  ఉష్ణోగ్రతలు ఇలా..  (డిగ్రీ సెల్సియెస్‌లలో)

స్టేషన్‌     గరిష్టం    
 
కనిష్టం
అదిలాబాద్‌     25.3     18
భద్రాచలం 22.2    16.5
హకీంపేట్‌ 21.2    17
దుండిగల్‌ 22.3     16.7
హన్మకొండ  22    17.5
హైదరాబాద్‌  22.4    17
ఖమ్మం     23.6    19.2
మహబూబ్‌నగర్‌ 21.9     18.7
మెదక్‌     25     14.8
నల్లగొండ 26.5   18
నిజామాబాద్‌ 24.1     18.9
రామగుండం     23    18.6  


 

మరిన్ని వార్తలు