హనుమకొండలో బీజేపీ, కాంగ్రెస్‌ వర్గాల ఘర్షణ

2 Jul, 2022 01:32 IST|Sakshi
దాడులు చేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు, (ఇన్‌సెట్‌) దాడిలో ధ్వంసమైన మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ కారు  

కర్రలతో పరస్పరం దాడి.. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు 

సీఐ గన్‌మన్‌ తలకు గాయం, ఆస్పత్రికి తరలింపు 

హనుమకొండ: కాంగ్రెస్, బీజేపీ పరస్పర దాడులతో హనుమకొండలోని హంటర్‌ రోడ్డు ప్రాంతం రణరంగంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిలో సీఐ గన్‌మన్‌ గాయపడ్డారు. బీజేపీ తెలంగాణ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా అనుబంధ సమావేశాలు జరుగుతున్న ప్రాంతంలో కాంగ్రెస్‌ నేతలు నిరసనకు దిగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు అడ్వకేట్స్‌ కాలనీ నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షురాలి క్యాంపు కార్యాలయం సమీపానికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయం కింద ఉన్న హాల్‌లో అప్పటికే బీజేపీ ఓబీసీ మోర్చా సమావేశం జరుగుతోంది.

దీనికి రాజ్యసభ సభ్యుడు ఓంప్రకాశ్‌ మాథూర్‌ హాజరయ్యారు. ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలుసుకున్న సుబేదారి, కేయూసీ ఇన్‌స్పెక్టర్లు రాఘవేందర్, దయాకర్‌ పోలీసు బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాజేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తుండగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షురాలి క్యాంపు కార్యాలయం వద్దకు చొచ్చుకెళ్లారు. బీజేపీ కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు రావడంతో ఇరువర్గాలవారు కర్రలతో దాడి చేసుకుంటున్న సమయంలో మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ కారులో వచ్చి దిగారు.

బీజేపీ కార్యకర్తలు ఆమె కారును చుట్టుముట్టి అద్దాలు ధ్వంసం చేశారు. ఇరువర్గాల దాడితో ఈ ప్రాంతం రణరంగంగా మారింది. దాడిలో సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ గన్‌మేన్‌ అనిల్‌ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఒక్కటై తమ కార్యాలయంపై దాడికి దిగారని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మాత్రమే వచ్చామని, బీజేపీ నేతలే కావాలని దాడి చేశారని రాజేందర్‌రెడ్డి ప్రత్యారోపణ చేశారు.

మరిన్ని వార్తలు