కొత్తగా 86 గురుకుల జూనియర్‌ కాలేజీలు 

2 Jul, 2022 01:27 IST|Sakshi

2022–23 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..

75 ఎస్సీ, 7 ఎస్టీ, 4 బీసీ కాలేజీలు 

ప్రస్తుత పాఠశాలలకు అనుబంధంగా ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌:  కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమల్లో భాగంగా తలపెట్టిన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఖ్య అంచెలంచెలుగా పెరుగుతోంది. ఇప్పటికే వెయ్యికి పైగా సంస్థలు ఉండగా, కొత్తగా 86 జూనియర్‌ కాలేజీలు రానున్నాయి. 2022–23 విద్యా సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇందులో 75 ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో, 7 గిరిజన గురుకుల సొసైటీలో, 4 బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు అనుబంధంగా వీటిని నిర్వహించనున్నారు. అయితే ఒకే ఆవరణ అయినప్పటికీ వేర్వేరు భవనాల్లో నిర్వహించాలని గురుకుల సొసైటీలకు ప్రభుత్వం సూచించింది.

ఈ మేరకు అనువైన భవనాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆయా సొసైటీల కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, గురుకుల సొసైటీల కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. కొత్త కాలేజీల ఏర్పాటు అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో చూడాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించినట్లు తెలిపారు.

అందువల్ల ఇవి త్వరగా ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న గురుకుల పాఠశాలల నిర్వహణను సీఎస్‌ సమీక్షించారు. వంట సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్‌ 
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్‌ ఉండాలని సీఎస్‌ చెప్పారు. వీటి ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్టడీ సర్కిళ్లు, కొత్తగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి తదితర అంశాలపై సంక్షేమ శాఖలు నివేదికను రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం,

పంచాయతిరాజ్‌ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్‌ నదీమ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల కార్యదర్శి రొనాల్డ్‌ రోస్, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి.షఫివుల్లా తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు