ఇంటి నుంచి గెంటేశారు.. | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి గెంటేశారు..

Published Tue, Dec 19 2023 1:44 AM

ఏఎస్పీ సర్కార్‌కు ఫిర్యాదు చేస్తున్న బాధితులు
 - Sakshi

కర్నూలు: వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కుమార్తెలు వేధిస్తున్నారని, తన భర్త మొదటి భార్య కుమారుడు ఆస్తి ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు గెంటేసి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అడిషనల్‌ ఎస్పీ టీ సర్కార్‌కు కల్లూరుకు చెందిన వృద్ధురాలు రూతమ్మ ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన ఆస్తిని ఇప్పించి న్యాయం చేయాల్సిందిగా కోరారు. రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పక్కనున్న ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి ఏఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి, నేరుగా వారితో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా స్పందనకు 83 ఫిర్యాదులు రాగా.. వాటన్నింటిపై చట్టపరిధిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాసులు, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు తదితరులు స్పందనలో పాల్గొన్నారు.

స్పందనకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ....

● ఫోర్జరీ సంతకాలతో కోడలు సుగుణమ్మ ఆస్తి కాజేసి మోసం చేసి ఇబ్బందులకు గురి చేస్తోందని ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామానికి చెందిన సుంకమ్మ ఫిర్యాదు చేశారు.

● తన 47.5 సెంట్ల పొలాన్ని మామ కొడుకు శేఖరయ్య ఆక్రమించుకొని రామదాసు అనే వ్యక్తికి అమ్మి మోసం చేశారని కోడుమూరు మండలం అనుగొండ గ్రామానికి చెందిన శివమ్మ ఫిర్యాదు చేశారు.

● జాబ్‌యార్డు ఆఫీస్‌ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని కర్నూలులోని ఎంఆర్‌బీ ట్రేడ్‌ సెంటర్‌లో వినయ్‌కుమార్‌ అనే వ్యక్తి మోసం చేస్తున్నాడని, తనతో రూ.10 వేలు తీసుకొని ఇవ్వడం లేదని ఆళ్లగడ్డకు చెందిన మాబుసుభాన్‌ ఫిర్యాదు చేశారు.

● కుమారులు తన బాగోగులు పట్టించుకోకుండా అన్నం కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కర్నూలు ఎస్‌ నాగప్ప వీధికి చెందిన నాగగోపాల్‌ ఫిర్యాదు చేశారు.

● బ్యాంకు ఖాతాలో పిల్లల చదువు కోసం దాచుకున్న రూ.60 వేలల్లో రూ.20 వేలు గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారని, ఈ సంఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని కర్నూలు మండలం జి సింగవరం గ్రామానికి చెందిన లక్ష్మిదేవి ఫిర్యాదు చేశారు.

న్యాయం చేయాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధురాలు

Advertisement
Advertisement