గుడ్‌ న్యూస్‌: విద్యార్థులు రీషెడ్యూల్‌ చేసుకోవచ్చు

23 Jul, 2021 09:16 IST|Sakshi

ఎంసెట్‌ తేదీపై విద్యార్థులకు ఉన్నత విద్యా మండలి వెసులుబాటు

బిట్‌సాట్, ఎంసెట్‌ ఒకేరోజు ఉన్నవారికి అవకాశం

కోవిడ్‌ పాజిటివ్‌ ఉంటే ప్రత్యేక పరీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్, బిట్‌సాట్‌ పరీక్షలు ఒకేరోజు ఉన్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెసులుబాటు కల్పించింది. ఎంసెట్‌ తేదీని మార్చుకునే అవకాశం ఇచ్చింది. బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌)లోని వివిధ కోర్సులలో ప్రవేశానికి బిట్‌సాట్‌–2021 పరీక్షను వచ్చే నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష వచ్చే నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ కోర్సు విద్యార్థులకు నిర్వహిస్తారు.

9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ కోర్సులు కోరుకునే విద్యార్థులకు ఉంటుంది. అయితే కొందరు విద్యార్థులకు ఒకే తేదీలో ఎంసెట్, బిట్‌సాట్‌ పరీక్షలు రెండూ ఉన్నాయి. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా విద్యార్థులు ఎంసెట్‌ తేదీని మార్చుకునేలా వెసులుబాటు కల్పించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి తెలిపారు. బిట్‌సాట్‌కు ఒకరోజు ముందు లేదా తరువాత రోజుకు ఎంసెట్‌ తేదీని మార్చుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులు ఈ–మెయిల్‌ (convener.eamcet@tsche.ac.in) ద్వారా ఎంసెట్‌ కన్వీనర్‌కు తమ అభ్యర్థనను పంపవచ్చు. ఇలావుండగా.. గత సంవత్సరం మాదిరిగానే ఎవరైనా కోవిడ్‌ పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉంటే ఎంసెట్‌ కన్వీనర్‌కు తెలియజేయాలి. ఎంసెట్‌ జరిగిన పది రోజుల తర్వాత వారికోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు