మళ్లీ వేలానికి వేళాయె

31 Aug, 2021 01:40 IST|Sakshi

117.29 ఎకరాలకు టీఎస్‌ఐఐసీ నోటిఫికేషన్‌ 

ఖానామెట్, పుప్పాలగూడలో అమ్మకానికి 35 పాట్లు 

వచ్చే నెల 27, 28 తేదీల్లో ఈ–వేలం ద్వారా విక్రయం 

ఖజానాకు రూ. 6 వేల కోట్లకు పైగా సమకూరే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులో నిరుపయోగంగా ఉన్న మరో 117.29 ఎకరాల ప్రభుత్వ భూములను ఈ– వేలం పద్ధతిలో విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికవసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ సర్వే నంబర్‌ 41/14లోని 22.79 ఎకరాల విస్తీర్ణంలోని 9 ప్లాట్లను విక్రయిస్తారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా గండిపేట మం డలం పుప్పాలగూడలో 325, 326, 327, 328 సర్వే నంబర్లలోని 94.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మరో 26 ప్లాట్లను కూడా వేలం వేస్తారు.

ఖానామెట్‌ భూములకు సెప్టెంబర్‌ 27న, పుప్పాలగూడ భూ ములకు ఆ మరుసటి రోజు ఈ– వేలం నిర్వహిస్తారు. ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపే వారికి వేలం విధానంపై అవగా హన కల్పించేందుకు వచ్చే నెల 9న బషీర్‌బాగ్‌లోని టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో ప్రి బిడ్‌ సమావేశం నిర్వహిస్తారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న ఖానా మెట్, పుప్పాలగూడ భూములకు ఇప్పటికే లే ఔట్‌ ఖరారు చేయగా, సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 24 వరకు ఆయా ప్లాట్లను నేరుగా సందర్శించే వీలు కల్పించారు. వచ్చే నెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా ఈఎండీ చెల్లించి వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా వేలంలో పాల్గొనవచ్చని టీఎస్‌ఐఐసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఎస్‌టీసీ) ఈ వేలం ప్రక్రియను నిర్వహిస్తుంది. 

గణనీయంగా పెరిగిన అప్‌సెట్‌ ధర 
ఈ ఏడాది జూలైలో కోకాపేట, ఖానామెట్‌ భూములకు నిర్వహించిన వేలంలో ఎకరా అప్‌సెట్‌ (కనీస) ధర రూ.25 కోట్లుగా, ఈఎండీని రూ.5 కోట్లుగా నిర్ణయించిన టీఎస్‌ఐఐసీ.. ప్రస్తుత వేలంలో ఖానామెట్‌ భూముల కనీస ధరను రూ.40 కోట్లకు పెంచింది. పుప్పాలగూడ భూముల అప్‌సెట్‌ ధరను రూ.35 కోట్లకు పెంచింది. జూలైలో జరిగిన వేలం పాటలో కోకాపేట భూములు ఎకరం సగటున రూ.40.05 కోట్లు, ఖానామెట్‌ భూములు రూ.48.92 కోట్లు పలకడంతో, ఈసారి అప్‌సెట్‌ ధరను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నిర్ణయించిన కనీస ధర ప్రకారం ప్లాట్లన్నీ అమ్ముడుబోయిన పక్షంలో ఖానా మెట్‌ భూములకు రూ.911.6 కోట్లు, పుప్పాలగూడ భూములకు రూ.3,307.5 కోట్లు కలిపి మొత్తంగా రూ.4,219.10 కోట్లు వస్తా యని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే వేలంలో భూములకు అధిక ధర లభిస్తే అదనంగా మరో రూ.2 వేల కోట్లు వచ్చే అవకాశముందని, అదే జరిగితే రూ.6 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు సమకూరే అవకాశముం దని టీఎస్‌ఐఐసీ వర్గాలు వెల్లడించాయి.

గత జూలైలో 64.85 ఎకరాల వేలం
రంగారెడ్డి జిల్లా కోకాపేట, ఖానామెట్‌లలోని 64.85 ఎకరాల విస్తీర్ణంలోని 13 ప్లాట్లకు గత జూలైలో రాష్ట్ర ప్రభుత్వం వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. కళ్లు చెదిరే ధరలతో రియల్‌ ఎస్టేట్, ఇన్‌ఫ్రా సంస్థలు ఈ భూములను దక్కించుకున్నాయి. కోకాపేటతో పోలిస్తే ఖానా మెట్‌ భూములకు ఎక్కువ ధర వస్తుంద ని అధికారులు ముందస్తు అంచనా వేయ గా, అదే రీతిలో వేలంలో బిడ్డర్లు భూము లు దక్కించుకునేందుకు పోటీ పడ్డారు.   

మరిన్ని వార్తలు