ఎన్‌ఈపీలో శుభ్రతను చేరుస్తాం

11 Dec, 2022 02:14 IST|Sakshi
పాఠశాలలో మరుగుదొడ్డిని  శుభ్రం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  

ఉస్మానియా యూనివర్సిటీ: జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ–2020)లో శుభ్రత, మౌలిక వసతుల కల్పన అంశాలను కూడా చేరుస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను శుభ్రపరిచే యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్‌ఈపీ కోసం కోట్లాది రూపాయాలను వెచ్చిస్తున్నామని ఇందులో మరుగుదొడ్ల పరిశుభ్రతకు నిధుల కేటాయింపుపై శ్రద్ధచూపుతామని తెలిపారు.

తగిన యంత్రాంగం లేక దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మరుగుదొడ్లు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని, వాటిని శుభ్రపర్చడం సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలో మరుగుదొడ్ల శుభ్రత, మంచినీరు, కరెంట్‌ బిల్లుల చెల్లింపు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారిందన్నారు. పాఠశాలల్లో టీచర్ల నియామకంతో పాటు మరుగుదొడ్లను శుభ్రపరిచే (శానిటేషన్‌) సిబ్బందిని కూడా నియమించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ముందుకు రావాలన్నారు. అనంతరం ఎన్‌టీపీసీ అందచేసిన 94 యంత్రాలను వివిధ పాఠశాలల ప్రధాన అధ్యాపకులకు అందచేశారు. త్వరలో మరో 150 యంత్రాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మరుగుదొడ్డిని కిషన్‌రెడ్డి మిషన్‌తో శుభ్రపరిచారు.

మరిన్ని వార్తలు