సమ్మె విరమించి 24 గంటలు గడవక ముందే..

19 Jun, 2019 13:30 IST|Sakshi

ఢిల్లీలోని ఆసుపత్రి సిబ్బందిపై స్థానికుల దాడి

న్యుఢిల్లీ: వైద్యులపై జరగుతున్న దాడులకు వ్యతిరేకంగా కోల్‌కతా వైద్యులు చేసిన సమ్మె విరమించి 24 గంటలు గడవక ముందే.. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో కొంతమంది స్థానికులు గొడవకు దిగారు. ఈ ఘటన మంగళవారం ఢిల్లీలోని మహర్షి వాల్మికి ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని బావణ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వృద్ధుడు.. ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకొని అక్కడి భద్రతా సిబ్బందితో గొడవకు దిగారు. ఆసుపత్రిలోకి ప్రవేశించి ఫర్నిచర్‌‌ను ధ్వంసం చేశారు. అదే ఆసుపత్రిలో ఉన్న నిందితుడిపై దాడి చేశారు.

అయితే, ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజీవ్‌ సాగర్‌ మీడియాతో మాట్లాడుతూ.. తొలుత శరీరం నిండా గాయాలతో ఉన్న ఓ వ్యక్తి (నిందితుడు) ఆసుపత్రిలో చేరాడని, ఆ తర్వాత కొంత సేపటికి అత్యాచారం జరిగిందంటూ నాలుగేళ్ల బాలికను పరీక్షల కోసం తీసుకొచ్చారని తెలిపారు. అయితే 4 గంటలకే ఎమర్జెన్సీ సేవలను నిలిపివేయడంతో బాలికను సమీప డాక్టర్ బీఎస్ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించామన్నారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి కొందరు వ్యక్తులు ఆసుపత్రిలోకి చొరబడి తొలుత చేరిన వ్యక్తిపై దాడి చేశారని, అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బందిని విడిచిపెట్టలేదన్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది పరుగులు తీశారన్నారు. అలాగే ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని, దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు రాజీవ్‌సాగర్‌ పేర్కొన్నారు. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ వైద్యకళాశాలలో గత సోమవారం ఇద్దరు డాక్టర్లపై ఓ రోగి బంధువులు దాడిచేయడంతో బెంగాల్‌లోని వైద్యులంతా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 31 మంది వైద్యుల బృందం మధ్య చర్చలు సఫలం అవ్వడంతో వైద్యులు తమ సమ్మెను విరమించారు.

>
మరిన్ని వార్తలు