తాను కరిగి.. స్టీరింగ్‌పై ఒరిగి..

24 Sep, 2019 09:40 IST|Sakshi

సమయం సోమవారం వేకువజాము 2.50 గంటలు.. టెక్కలి మండలం అక్కవరం గ్రామ సమీప ప్రాంతం.. ఒడిశా రాష్ట్రం డమన్‌జోడి నుంచి భువనేశ్వర్‌ వెళుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు చిన్న కుదుపుతో ఆగింది.. నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచిన ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం కాలేదు.. బస్సు తుప్పల్లో ఎందుకు ఆగిందో తెలుసుకునేందుకు డ్రైవర్‌ వద్దకు వెళ్లిన వారు నిశ్చేష్టులయ్యారు. స్టీరింగ్‌పై తలపెట్టి డ్రైవర్‌ విగత జీవిగా ఉన్నాడు..

సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : కొవ్వొత్తి తాను కరిగిపోతూ లోకానికి వెలుగునిస్తుంది.. ఆ డ్రైవర్‌ గుండెపోటుతో ఒరిగిపోతున్నా 26మందిని రక్షించాడు.. నిత్యం విధి నిర్వహణలో భాగంగా బస్సును నడుపుతూ ఎంతోమందిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేవాడతను. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా బాధ్యతను మరచిపోలేదు... బస్సును సురక్షితంగా పక్కన నిలిపాడు. ఆపద్బాంధవుడిలా 25మంది ప్రయాణికులను, తోటి డ్రైవర్‌ను కాపాడాడు. ఉలిక్కిపడి లేచి ఈ విషయం తెలుసుకున్న పాసింజర్లు కన్నీటిపర్యంతమయ్యారు. డమన్‌జోడిలో బస్సు ఆది వారం రాత్రి 10 గంటలకు బయలు దేరింది. ఇద్దరు డ్రైవర్‌లు ఉన్న ఈ బస్సును ఒడిశా రాష్ట్రం గంజామ్‌ జిల్లా కుంపుపొడ గ్రామానికి చెందిన జోగేందర్‌ శెట్టి (52) అనే డ్రైవర్‌ నడుపుతున్నారు. రాత్రి 2.50 గంటల సమయంలో టెక్కలి సమీపంలో అక్కవరం గ్రామ సమీపంలో గుండెపోటు రావడంతో.. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరుగకూడదని భావించి బస్సును ఎంతో చాకచక్యంగా రోడ్డు పక్కనున్న తుప్పల్లో నిలిపివేశాడు.

తుప్పల్లో హఠాత్తుగా బస్సు ఆగడంతో విషయం తెలియని పాసింజర్లు ఏం జరిగిందని అడిగేందుకు డ్రైవర్‌ వద్దకు వెళ్లగా.. స్టీరింగ్‌పై తలపెట్టి ప్రాణాలు కోల్పోయి ఉన్నా డు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడి తాను ప్రాణం విడిచాడని గుర్తించి హతాశులయ్యారు. జాతీయ రహదారి విభాగం హైవే పెట్రోలింగ్‌ అధికారులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ ఆర్‌.నిలయ్య, ఎస్‌ఐ బి.గణేష్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని గమనించి బస్సు యజమానికి సమాచారం చేరవేశారు. బస్సులో ప్రయాణం చేస్తున్న 25మంది ప్రయాణికులను అదే ట్రావెల్‌కు చెందిన మరో బస్సులో పంపించేశారు. డ్రైవర్‌ మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాణాలు పోతున్నా డ్రైవర్‌ చూపినచొరవ.. అతని అప్రమత్తత వల్ల తమం తా క్షేమంగా ఉండడం ప్రయాణికులను కదిలించింది. 

మరిన్ని వార్తలు