తెలంగాణ రోడ్ మ్యాప్ ప్రకటించాలి: జి.కిషన్‌రెడ్డి

11 Sep, 2013 04:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు, రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం వెంటనే రోడ్‌మ్యాప్ ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేబినేట్ నోట్ తయారీకే నెల రోజులు పడితే బిల్లు తయారీకి ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నించారు. ఢిల్లీలో పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు జేఏసీ నేతలు కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య మంగళవారం బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, సీహెచ్ విద్యాసాగరరావు, దత్తాత్రేయ, రాజేశ్వరరావు, అశోక్‌కుమార్ యాదవ్ తదితరులతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం లక్ష్మయ్యతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
 
 సీమాంధ్రకు ఎలా న్యాయం చేయబోతున్నారో కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా ప్రకటించి అక్కడి నేతల నోళ్లకు తాళం వేయించాలని డిమాండ్ చేశారు. సీమాం ధ్ర రాజధానికి ఎంత ఖర్చయినా వెనకాడబోమని కేంద్రం చెప్పాలన్నారు. సీమాంధ్రలో బీజేపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను లక్ష్మయ్య ఖండించారు. విభేదాలను పక్కనబెట్టి జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాలకు హాజరుకావాలన్న కోదండరాం వినతి మేరకు బీజేపీ నేతలు మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. విభేదాలను పరిష్కరించుకునేందుకు బుధవారం సాయంత్రం మరోసారి సమావేశం కావాలని వారు నిర్ణయించారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.

>
మరిన్ని వార్తలు